ట్రంప్ ఒత్తిడి.. చాబహర్‌ పోర్టు నుంచి తప్పుకోనున్న భారత్‌ !

ఇరాన్‌లోని చాబహర్ ఓడరేవుకు భారత్‌ ఎంతో మంచి సంబంధం ఉంది. పోర్టు నిర్మాణంలో దాదాపు పదేళ్లుగా భాగస్వామి ఉంది. దీనిపై భారత్‌ నిధులు కూడా ఎక్కువగా కేటాయిస్తోంది.

New Update
Did US force India to pull out of Iran's Chabahar port

Did US force India to pull out of Iran's Chabahar port

ఇరాన్‌లోని చాబహర్ ఓడరేవుకు భారత్‌ ఎంతో మంచి సంబంధం ఉంది. పోర్టు నిర్మాణంలో దాదాపు పదేళ్లుగా భాగస్వామి ఉంది. దీనిపై భారత్‌ నిధులు కూడా ఎక్కువగా కేటాయిస్తోంది. అయితే ఈ పోర్టుపై ఇప్పుడు రాజకీయ వివాదం నెలకొంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలకు ట్రంప్ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. 25 శాతం సుంకాలు విధిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌తో వ్యాపారం చేస్తే భారత్‌కు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ట్రంప్ ఒత్తిడి చేయడంతో చాబహర్ పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి భారత్‌ తప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ట్రంప్‌కు ప్రధాని మోదీ లొంగిపోయారని.. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. చివరికి భారత విదేశాంగ విధానాన్ని కూడా అమెరికా వైట్‌హౌస్ నిర్దేశించే పరిస్థితికి దిగజారిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. చాబహర్ పోర్టుకు సంబంధించి తమ వైఖరి మార్చుకునేది లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తేల్చిచెప్పారు. దీంతో ఈ పోర్టు నుంచి భారత్‌ నిజంగా తప్పుకుందా లేదా అనే సందేహం మొదలైంది. ఒకవేళ తప్పుకుంటే మనకు ఎలాంటి నష్టం జరుగుతోందో అనేది చర్చనీయమవుతోంది. 

Also Read: కుల్దీప్‌ సెంగర్‌కు బిగ్ షాక్.. శిక్ష రద్దు పిటిషన్‌ను కొట్టివేసి కోర్టు

ఓవైపు చైనా.. పాకిస్థాన్‌లో బలుచిస్థాన్‌లో గ్వాదర్‌ పోర్టును నిర్మిస్తోంది. దీనివల్ల ఆ ప్రాంతంలో సొంత ప్రయోజనాలు రక్షించుకునేందుకు భారత్‌కు కూడా బరిలోకి వచ్చింది. గ్వాదర్ పోర్టుకు పోటీగానే ఇరాన్‌ తీరంలో ఉన్న చాబహర్ ఓడరేవు నిర్మాణాన్ని మొదలుపెట్టింది. గతేడాది అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ సమయంలో ట్రంప్ యంత్రాంగం చాబహర్ పోర్టుపై ఆంక్షలు విధించింది. అక్కడ జరుగుతున్న పనులను పూర్తిగా నిలిపివేయాలని భారత్‌కు సూచలను చేసింది. ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చింది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్‌ దాకా ఆంక్షల నుంచి మినహాయింపుకు అనుమతి ఇచ్చింది. పోర్టు నిర్మాణం కోసం భారత్‌ ఇప్పటికే ఇరాన్‌కు 12 కోట్ల డాలర్ల వరకు ట్రాన్స్‌ఫర్ చేసింది.  

చాబహర్ పోర్టు అనేది ఇరాన్‌లో వ్యహాత్మకంగా ఉంది. పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టుకు 170 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. ప్రపంచ ఇంధన బిజినెస్‌కు చెక్‌పాయింట్ లాంటి హొర్మూజ్‌ జలసంధికి దగ్గర్లోనే ఇది ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని భారత్‌ ఎంపిక చేసుకుంది. దీనివల్ల అఫ్గనిస్థాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడనుంది. దీనికి పాక్‌ రేవులతో పని ఉండదు. అలాగే అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్‌లో  కూడా ఈ చాబహర్ పోర్టు అనేది కీలకంగా ఉంది. 

ఈ పోర్టు గుండా ముంబై నుంచి రష్యా, యూరప్‌లకు వెళ్లొచ్చు. సరకు రవాణా అనేది సులభతరమవుతుంది. అంతేకాదు ప్రయాణ సమయంలో కూడా భారీగా ఖర్చు తగ్గుతుంది. అరేబియా, పశ్చిమ హిందూ మహా సముద్రంలో పాక్‌-చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఇదిలాఉండగా పోర్టు నిర్మాణం, నిర్వహణ, ఇతర పనుల కోసం భారత్, ఇరాన్‌ల మధ్య 2003లోనే చర్చలు మొదలయ్యాయి. 2015లోనే ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్‌లో చాబహర్‌లో భారత్‌ తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. చాబహర్ నుంచి అఫ్గాన్‌ సరిహద్దులోని జహెదాన్‌ దాకా రైలు రూట్‌ను  అభివృద్ధి చేసేందుకు భారత్‌ ఒప్పుకుంది. దీనివల్ల వ్యాపార విస్తరణ మెరుగయ్యే ఛాన్స్ ఉంది.

Also Read: అమెరికాపై వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించనున్న EU.. ఇదే జరిగితే అంతర్జాతీయ సంక్షోభమే

 చాబహర్ కోసం భారత్‌ వ్యయం 370 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 120 మిలియన్ డాలర్లు ప్రత్యక్ష పెట్టుబడి ఉండగా.. 250 మిలియన్ డాలర్లను ఇరాన్‌కు రుణంగా అందిస్తోంది. ఇప్పటికే 120 మిలియన్ డాలర్లను ఇరాన్‌కు ఇచ్చేసింది. చాబహర్‌పై విధించిన ఆంక్షల గడువు కూడా త్వరలో ముగియనుంది. దీంతో గడువు పెంపు కోసం భారత ప్రభుత్వం కూడా యత్నిస్తోంది. అమెరికాతో సంప్రదింపులు చేస్తోంది. ఇరాన్‌పై ట్రంప్‌ సర్కార్‌ కఠినంగా ఉంటున్న నేపథ్యంలో ఆంక్షలు ఎత్తివేసే ఛాన్స్ కనిపించడం లేదు. అమెరికాను నిర్లక్ష్యం చేస్తే భారత్‌పై మరో 25 శాతం టారిఫ్‌ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఇది జరిగితే భారత్‌కు నష్టం ఉందంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు