/rtv/media/media_files/2025/05/03/rsjc7fTJtJMK2HaVluue.jpg)
balochistan Liberation Army
Balochistan: బలూచిస్తాన్‌లో మరోసారి హింస చెలరేగింది. పాక్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వ్యూహాత్మకంగా భారీ దాడులకు తెగబడింది. ‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్ఏ తిరుగుబాటుదారులు జరిపిన ఈ మెరుపు దాడుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, ఎదురుకాల్పుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. బలూచిస్తాన్‌లోని ఐదు ప్రధాన జిల్లాలైన క్వెట్టా, మాస్తంగ్, నుష్కి, పస్ని, గ్వాదర్‌లలోని 12 కీలక ప్రాంతాలపై బీఎల్ఏ ఏకకాలంలో విరుచుకుపడింది.
Also Read: హైదరాబాద్‌లో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్.. ఎక్కడో తెలుసా?
ఆధునిక తుపాకులు, పేలుడు పదార్థాలతో పాటు ఆత్మాహుతి దాడులను కూడా బీఎల్ఏ ప్రయోగించింది. ముఖ్యంగా పాక్ మిలిటరీ స్థావరాలు, భద్రతా దళాల కాన్వాయ్‌లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. తిరుగుబాటుదారుల కదలికలను గమనించిన పాక్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ హోరాహోరీ పోరులో ఇరువైపులా భారీ ప్రాణనష్టం సంభవించింది.
Also Read: మరికొన్ని గంటల్లో బడ్జెట్.. ఈ టైంలో ఏం కొనాలి? ఏం కొనొద్దో తెలుసా?
ఈ దాడులు చేసింది తామేనని బీఎల్ఏ బహిరంగంగా ప్రకటించుకుంది. బలూచిస్తాన్ స్వేచ్ఛ కోసం సాగుతున్న పోరాటంలో భాగంగానే సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. మరోవైపు, పాక్ అధికారులు స్పందిస్తూ.. బీఎల్ఏ పక్కా ప్రణాళికతో దాడులు చేసినప్పటికీ, భద్రతా దళాల సమర్థవంతమైన ప్రతిఘటన వల్ల భారీ ముప్పు తప్పిందని తెలిపారు. ఈ కాల్పుల ఘటనల్లో సామాన్య పౌరులెవరూ మరణించలేదని ప్రభుత్వం ధృవీకరించింది. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాలన్నింటిలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. బలూచిస్తాన్‌లో దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగుతోంది. ఈ తాజా దాడులు బలూచిస్తాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను మరోసారి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాయి. చైనా పెట్టుబడులతో నిర్మిస్తున్న గ్వాదర్ పోర్ట్ వంటి కీలక ప్రాజెక్టులకు కూడా ఈ తిరుగుబాటు ముప్పుగా పరిణమించింది.
Follow Us