Sheikh Hasina: పెళ్ళి రోజునే మరణశిక్ష..నవంబర్ 17 షేక్ హసీనాకు స్పెషల్ డే

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు నిన్న మరణశిక్ష విధించింది.  మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ శిక్షను విధించారు. ఆమె వివాహ వార్షికోత్సవం నాడే హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడటం గమనార్హం.

New Update
Sheikh Hasina

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలో జరిగిన అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెపై అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు సోమవారం దీనిపై విచారణ జరపగా షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

అదే రోజున పెళ్ళి..

షేక్ హసీనాకు మరణశిక్షను విధిస్తూ ఆ దేశ కోర్టు నవంబర్ 17న తీర్పు వెల్లడించింది. ఈ రోజుతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. నవంబర్ 17న షేక్ హసీనా పెళ్ళి రోజు. 1967 నవంబర్ 17న హసీనా వివాహం చేసుకున్నారు. డా.ఎం.ఎ. వాజెద్మియా అనే వ్యక్తితో ఆమె వివాహం అత్యంత నిరాడంబరంగా.. సన్నిహితుల మధ్య జరిగింది. ఈ పెళ్ళి ఒక రకంగా రహస్యంగా జరిగిందనే చెప్పాలి. ఆ సమయంలో బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొని ఉండటం, హసీనా తండ్రి జైల్లో ఉండటంతో ఆమె అత్యంగ గోప్యంగా పెళ్ళి చేసుకోవలసి వచ్చింది. దాని తర్వాత తన తండ్రి ఆశీర్వాదం కోసం ఆమె నేరుగా జైలుకు వెళ్ళారు. ఇప్పుడు అదే రోజు షేక్ హసీనాకు మరణశిక్ష విధించడం అంతా విధి నిర్ణయం అంటున్నారు.

ఈ తీర్పుపై తాజాగా షేక్ హసీనా స్పందించారు. ఈ తీర్పు మోసపూరితమైనదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకోకుండా ఏర్పడ్డ ప్రభుత్వం తనకు కావాలనే కుట్రపూరితంగా శిక్ష పడేలా చేశారని మండిపడ్డారు. కనీసం తనను తాను నిరూపించుకునేందుకు కోర్టు ఛాన్స్ ఇవ్వలేదని వాపోయారు. న్యాయమూర్తులు కూడా ఈ విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి కోర్టు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిపారు. తమ దేశంలో విద్య, ఉద్యోగాలు, పేదరిక నిర్మూలణ, అభివృద్ధి లాంటి అనేక విషయాల్లో ఎన్నో చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 2010లో బంగ్లాదేశ్‌ను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో చేరేలా తమ ప్రభుత్వమే నడిపించిందని తెలిపారు. మయన్మార్‌లో హింస జరిగినప్పుడు బంగ్లాదేశ్‌కు వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించామని పేర్కొన్నారు.

కట్టుబడి ఉంటాం..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరణశిక్షపై భారత్ స్పందించింది. ఓ పొరుగు దేశంగా.. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం విషయంలో అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. అయితే హసీనాను వెంటనే అప్పగించాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ పై మాత్రం భారత్ ఏమీ సమాధానం చెప్పలేదు.

Also Read: Bihar: బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ, జేడీయూ పోటీ

Advertisment
తాజా కథనాలు