Asia Cup : ఆసియా కప్.. ట్రోఫీ పై రచ్చ..ఇవ్వలేదా ? తీసుకోలేదా ? బీసీసీఐ ఏమంటోంది?

పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన విషయ తెలిసిందే. అయితే భారత్‌ విజయం తర్వాత దుబాయ్‌ స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  టోర్నీ ముగిసి రెండు రోజులైనప్పటికీ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు విన్నింగ్‌ ట్రోఫీ అందలేదు.

New Update
Asia Cup

Asia Cup

Asia Cup : పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన విషయ తెలిసిందే. అయితే భారత్‌ విజయం తర్వాత దుబాయ్‌ స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  టోర్నీ ముగిసి రెండు రోజులైనప్పటికీ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు విన్నింగ్‌ ట్రోఫీ అందలేదు.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా  విన్నింగ్‌ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఏసీసీ చీఫ్‌గా ఉన్న మొహిసిన్‌ నక్వీ పాకిస్థాన్‌ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉండడంతో.. ఆదివారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌ గెలిచిన అనంతరం అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకొనేందుకు భారత్‌ నిరాకరించింది. 

ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించడంతో ప్రతిగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇ‍వ్వాల్సిన మెడల్స్‌ను కూడా తీసుకుని వెళ్లిపోయాడు. అయినా భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే గెలుపు సంబురాలు అద్భుతంగా చేసుకున్నారు. తాజాగా నఖ్వీ తాను ఎత్తుకెళ్లి పోయిన ట్రోఫీని, మెడల్స్‌ను భారత ఆటగాళ్లకు ఇచ్చేందుకు సిద్ద పడ్డాడు. కానీ, అతనే స్వయంగా భారత కెప్టెన్‌కు ట్రోఫీని, మిగతా ఆటగాళ్లకు మెడల్స్‌ను ఇస్తానని చెప్పాడు. అయితే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత ఆటగాళ్లు సిద్ధంగా లేరు. ఈ క్రమంలో  నఖ్వి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీసీసీఐ (BCCI).. మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏజీఎం సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తింది. సమావేశానికి వర్చువల్‌గా హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా నఖ్వికి పలు ప్రశ్నలు సంధించారు. ట్రోఫీ ఏసీసీ సొత్తు అని, నఖ్విది కాదని తీవ్రంగా ఆక్షేపించారు. ట్రోఫీని సరైన పద్ధతిలో భారత్‌కు అందజేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ఏసీసీ వెంటనే పరిశీలించాలని కోరారు.

దీనిపై స్పందించిన నఖ్వీ తన నుంచి ట్రోఫీని స్వీకరించబోమని భారత జట్టు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నాడు.  దీనిపై శుక్లా మరిన్ని ప్రశ్నలు సంధించగా సమావేశంలో కాకుండా వేరే వేదికపై చర్చిస్తామని నఖ్వీ తెలిపినట్లు తెలుస్తోంది. అయినా ట్రోఫీ గురించి బీసీసీఐ తన వాదనను కొనసాగించింది. ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచాలని, అక్కడి నుంచి దాన్ని తాము తీసుకుంటామని బీసీసీఐ ప్రతినిధి స్పష్టం చేశారు. కానీ, అందుకు నఖ్వి అంగీకరించలేదు. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరముందనడంతో రాజీవ్‌ శుక్లా సీరియస్‌ అయ్యారు. ట్రోఫీ తమదేనని, చర్చించడానికి ఏమీ లేదని ధీటుగా సమాధానం ఇచ్చారు.  

అయితే ఆసియా కప్‌ ట్రోఫీ విషయం మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో తేలకపోవడంతో ఈ సమస్య పరిష్కార బాధ్యతలను ఏసీసీలోని ఐదు టెస్ట్‌ దేశాలకు వదిలేశారు. దీంతో భారత్‌, పాకిస్థాన్‌, అప్ఘానిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ బోర్డులు దీనిపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై నవంబర్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో ఫిర్యాదు చేయాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది.

Also Read:  తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. రిజర్వేషన్లలో గందరగోళం.. అక్కడ మళ్లీ మార్పు?

Advertisment
తాజా కథనాలు