India Voted : ఇజ్రాయెలె-హమాస్ మధ్య యుద్ధం(Israel-Hamas War) మొదలై రెండు నెలలు పూర్తయింది. మధ్యలో ఓ వారం కాల్పులు ఆపారేమో అంతే మళ్ళీ యుద్ధం మొదలెట్టేశారు. హమాస్ తన దగ్గర ఉన్న బందీలను కొంత మందిని విడిచిపెట్టింది. కానీ ఇంకా వారి దగ్గర 130 మంది దాకా ఇజ్రాయెల్ పౌరులు బందీలుగానే ఉన్నారు. మరోవైపు హమాస్ ను పూర్తిగా మట్టుబెట్టేవరకు ఊరుకునేదే లేదు అంటోంది ఇజ్రాయెల్. దాడులను రోజురోజుకూ మరింత ఎక్కువ చేస్తూ భీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ దాడుల వల్ల గాజాలో ప్రజల జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. రోజుకు వవందలు, వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
Also Read : 2040 నాటికి జాబిల్లి పైకి భారతీయుడు.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు
ఇరు వర్గాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితితో పాటూ ప్రపంచ దేశాలు పాటుపడుతున్నాయి. ఇంతకు ముందు ఇజ్రాయెల్ కాల్పులు ఆపే దిశగా ఐరాస తీర్మానించింది. కానీ దాన్ని ఇజ్రాయెల్ మిత్ర దేశమైన అమెరికా తిరస్కరించింది. ఇప్పుడు మళ్ళీ ఐక్యరాజ్యసమితి కొత్త తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇరు పక్షాలు కాల్పుల విరమణ చేయాలని..గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయాలని జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని పెట్టింది. దీనికి భారతదేశం(India) అనుకూలంగా ఓటు వేసింది.
నిన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక అత్యవసర సెషన్ లో ఈజిప్ట్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి అనుకూలంగా 153 దేశాలు...23 దేశాలు వ్యతిరేకంగానూ ఓటు వేశాయి. 10 దేశాలు అసలు ఓటింగ్ లో పాల్గొనలేదు. అమెరికా తీర్మానానికి సవరణలు చేసింది. ముందు హమాస్ చేసిన దారుణాన్ని..ఇజ్రాయెల్ లో అది జరిపిన దాడులు, అక్కడి పౌరులను బందీలుగా తీసుకెళ్ళడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక వ్యాఖ్యని చేర్చాలని అమెరికా కోరింది.