ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు గెలుపుకోసం పోరాడుతోంది. 41 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత ప్లేయర్లలో రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లీ (56), శ్రేయస్ అయ్యర్ (48) మాత్రమే రాణించారు. ప్రస్తుతం రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు.
కాగా అంతకుముందు రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారు జట్టు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 74 పరుగులతో రాణించాడు.
ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లబుషేన్ ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ 72 పరుగులతో చివర్లో దుమ్మురేపాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్ల తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు.