నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్).. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి మరింత భరోసా కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమస్యలున్న పేద రోగుల్లో అవసరమైన వారికి ఉచితంగా గుండె కవాటా (హార్ట్ వాల్వ్)లను అందించేందుకు సిద్ధమైంది. గుండె సిరలు దెబ్బతిన్న వారికి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో కృత్రిమంగా తయారు చేసిన హార్ట్ వాల్వ్‌లను అమరుస్తున్నారు. అయితే దీనికి ఎక్కువ ఖర్చు అవుతుండటంతో పేదలకు పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే వారికి ఉచితంగా చికిత్స చేసేందుకు ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్ వాల్వ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే హార్ట్ వాల్వ్ బ్యాంకును వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించాలని యోచిస్తున్నారు.
Also Read: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు!
ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుంచి అవయవాలను సేకరిస్తోంది. మృతుని కుటుంబసభ్యుల అంగీకారం మేరకు కిడ్నీలు, కళ్లు, కాలేయం, గుండె, తదితర కీలక ఆర్గాన్స్‌ను సేకరిస్తోంది. అలాగే బ్రెయిన్ డెడ్‌కు గురైన వాళ్ల నుంచి హార్ట్ వాల్వ్‌లను సేకరించి.. వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక విభాగాన్ని (హార్ట్ వాల్వ్ బ్యాంకు)ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ బ్యాంకులో భద్రపరిచిన గుండె కవాటాలను పూర్తిగా ఉచితంగా అందించడం వల్ల.. గుండె సమస్యతో నిమ్స్‌కు వచ్చే రోగులకు చాలావరకు ఖర్చు తగ్గుతుంది.
Also Read: వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డ పై హక్కు ఉండదు!