Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా (Hathras District) లో భోలే బాబా (Bhole Baba) ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 121 మంది మృతి చెందారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం పరారీలో ఉన్న నారాయణ్ సాకార్ హరి అలియస్ భోలే బాబా కోసం గాలిస్తున్నామని అలీగఢ్ ఐజీ శాలభ్ మథురు తెలిపారు. అతడిపై ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని చెప్పారు. దొరికిన వెంటనే విచారణ చేస్తామని.. ఈ ఘటనలో ఆయన బాధ్యత ఉంటే అరెస్టు చేస్తామని చెప్పారు.
Also read: తెలంగాణలో ‘నిరుద్యోగుల మార్చ్’.. బర్రెలక్క అరెస్ట్!
ఇదిలాఉండగా.. ప్రస్తుతం భోలే బాబా పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఆయనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. అతనికి సంబంధించిన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. భోలే బాబాకు దేశంలో మొత్తం 24 ఆశ్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. బాబా ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అతని ఆశ్రమంలో ఉంటున్న విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఈ ఆశ్రమాలను నిర్వహిస్తున్నారు. అతనికి సన్నిహితంగా ఉండేవాళ్లే వీటి కార్యకలాపాలు చూస్తుంటారు. ఎప్పుడూ కూడా సూటూ బూటు, కళ్లద్దాలతో కనిపించే భోలే బాబా.. తన అనుచరులకు దర్శనమిచ్చేటప్పుడు భారీ పరేడ్‌తో వస్తుంటారు.
మొత్తం 16 మంది వ్యక్తిగత కమాండోలు అతని కారుకు ముందు 350 సీసీ బైక్‌లపై ప్రయాణిస్తూ దారిని క్లియర్ చేస్తుంటారు. వెనుకాల ఏకంగా 15 నుంచి 30 కార్లతో భోలే బాబా కాన్వాయ్ ఉంటుంది. సూరజ్‌పాల్ మెయిన్‌పురిలోని ఆశ్రమంలో అతను తన భార్యతో కలిసి ఉంటారు. హరి నగర్‌గా పిలిచే ఈ ఆశ్రమం 13 ఎకరాల్లో ఉంటుంది. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దీనికి విరాళాలిచ్చిన 200 మంది దాతల పేర్లు కనిపిస్తుంటాయి. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు విరాళం ఇచ్చిన ఆ దాతల వివరాలు ఉంటాయి. ఇక మిగతా ఆశ్రమాలను అతని సన్నిహితులు నడిపిస్తుంటారు.
Also Read: బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్
ఇదిలాఉండగా.. తొక్కిసలాట జరిగిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీన్ని రాజకీయం చేయడం తన ఉద్దేశం కాదని.. బాధితులకు భరోసా ఇవ్వడమ కోసమే వచ్చామని పేర్కొన్నారు. సత్సంగ్ కార్యక్రమంలో భోలే బాబా పాద దూళిని తాకేందుకు అక్కడున్న వారు ఒక్కసారిగా వచ్చారు. దీంతో బాబా సిబ్బంది వాళ్లని వెనక్కి నెట్టడంతో పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. మరోవైపు సత్సంగ్ కార్యక్రమం నిర్వహణలో అధికార యంత్రాంగం వైపు నుంచి కూడా లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది.