Padala Aruna joined Janasena Party : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత 'వారాహి విజయ యాత్ర'లో భాగంగా విశాఖ పట్నంకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు కారణంగా.. జనసేన పార్టీ పలు జాగ్రత్తలు తీసుకుంది. దీనిపై జనసేన శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అటు ఉంచితే.. జనసేన పార్టీలో జోష్ నెలకొంది. మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పడాల అరుణ మెడలో జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు పవన్.
ఈ సందర్భంగా జనసేన చీఫ్ మాట్లాడుతూ.. పడాల అరుణ లాంటి సీనియర్ నేతలు జనసేనలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే తనను పడాల అరుణ కలిశారని పవన్ గుర్తు చేశారు. ప్రజల కోసం తాను పడుతున్న తపనను, పోరాటం పట్ల ఆకర్షితురాలినైనట్లు వెల్లడించారు. మీ పోరాటంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని జనసేన పార్టీలో చేరతానన్నారని.. తాను స్వాగతించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
జనసేన పార్టీలో చేరిన అనంతరం పడాల అరుణ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి ఏమీ బాగోలేదని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు. అందువల్లే తాను పవన్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. పడాల అరుణ లాంటి సీనియర్ నేతలు జనసేన పార్టీలో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని తాను బలంగా నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.
కాగా.. పడాల అరుణ గజపతినగరం నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా మూడు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి గెలుపొందారు. 1989, 1994, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేకాదు చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆమె సైలెంట్ అయిపోయారు. అయితే గజపతి నగరం నియోజకవర్గంలో గానీ టీడీపీలో గానీ తనకు ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదని భావించిన ఆమె రెండేళ్ల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె వైసీపీలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా ఆమె జనసేన పార్టీలో చేరారు.