Bus Yatra : తెలంగాణ(Telangana) లో పార్లమెంటు ఎన్నికలు(Parliament Elections) దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్(KCR).. రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేసవిలో జన సమీకరణ కష్టమని భావించి.. బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బస్సుయాత్రకు సంబంధించి ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.
Also Read: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం..
ఈ నెల 15 తర్వాత బస్సు యాత్ర ప్రారంభించేలా కసరత్తులు చేస్తున్నారు. మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూట్‌మ్యాప్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే కనీసం వంద అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ మీటింగ్‌లు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బస్సు యాత్రకు ముందు ఏప్రిల్ 13న చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధిష్ఠానం ప్లాన్ వేస్తోంది.
ఇంతకుముందు సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేద్దామనుకున్న కేసీఆర్.. చివరికి ఏపీ సీఎం వైఎస్ జగన్ తరహాలో బస్సు యాత్రకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ బస్సు యాత్రను పరిశీలించిన కేసీఆర్.. తెలంగాణలో కూడా అదే రీతిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మే 13న జరగనున్నాయి. జూన్ 4 న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Also Read: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి… ఇది పదకొండవది!