బీజేపీకి అసెంబ్లీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తమ పార్టీకి అభ్యర్థులు లేరు అనే వారు గుడ్డి వారన్నారు. కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వారు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వారిలా తమ పార్టీ నేతలు అమ్ముడు పోరని ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కనీసం 40 మంది ఎంపీలు కూడా లేరన్న ఆయన.. అలాంటి పార్టీ సీడ్ల్యూసీ సమావేశానికి పరేడ్ గ్రౌండ్ అవసరమా అని ఎంపీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ కుర్చీల కోసమే కొట్టుకుంటారన్న ఆయన.. వారి మొహాలకు సభ ఎక్కడ నిర్వహిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ మీటింగ్‌కు గాంధీభవన్ చాలని ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ.. కవితకు నిజామాబాద్‌లో ఏం పని అన్నారు. కవిత ఏదో ఒక కార్యక్రమం వంకతో వారానికి రెండు సార్లు నిజామాబాద్‌కు వస్తున్నారన్నారు. తన కార్యక్రమం తాను చూసుకొని వెళ్తే చాలన్న ఎంపీ.. వచ్చిన ప్రతీసారి తనపై లేనిపోని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. కవితకు తనపై కోపం ఉంటే తన వెంట పడాలన్నారు. అంతే కానీ వారానికి రెండు సార్లు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆయన.. అందులో భాగంగానే ఇప్పటికే గ్రామస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పుల గురించి, కేసీఆర్ అవినీతి గురించి బీజేపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఇంటి ఇంటికీ తిరుగుతున్న బీజేపీ శ్రేణులు బీజేపీ అధికారంలోకి వచ్చాక చేసే అబివృద్ది పనుల గురించి వివరిస్తున్నట్లు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు చోట్ల ఓడిపోతారని ఎంపీ జోస్యం చెప్పారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో కవితను మళ్లీ ఓడిస్తానని అర్వింద్ సవాల్ చేశారు.