టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు పోయేకాలం దగ్గర పడిందని, అందుకే అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా సాక్ష్యాలు లభించిన తర్వాత అరెస్ట్ చేస్తారు కానీ.. జగన్ మాత్రం చంద్రబాబును అరెస్ట్ చేసి సాక్ష్యాల కోసం వెతుకుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయి 20 రోజులు దాటిందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం మాత్రం చంద్రబాబు అరెస్ట్‌పై ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు.
ఇప్పటికైనా చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అక్రమ ఆస్థుల కేసులో పదేళ్లుగా బెయిల్‌పై బయట తిరుగుతున్న జగన్.. రాష్ట్రాన్ని అదానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు. గత నాలుగున్నరేళ్లలో అభివృద్ధిలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన ఆరోపించారు. జగన్ పాలనలో జరగని అవినీతి లేదన్నారు.ఇసుక మాపియా నుంచి అనేక అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల ముందు జగన్ వస్తే జాబు వస్తుందని నీతులు పలికిన జగన్ తాను అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఆయన ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు.
వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ రాక కాలీగా ఉండలేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి బ్రతుకుతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ మాటలు నమ్మి వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు మరోసారి అలాంటి తప్పు చేయకూడదని అనుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పొటీ చేస్తాయన్నారు. రాష్ట్రంలో రాబోయ్యేది బీజేపీ, వైసీపీ యేతర ప్రభుత్వమే అన్నారు.
ALSO READ: మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి అస్వస్థత