Telangana: ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం మార్పు చర్చనీయాంశమవుతోంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర చిహ్నం, గేయాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై బీఆర్‌ఎస్ మాత్రం రేవంత్ సర్కార్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాన్ని ఇరాకటంలో పడేయాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. తాజాగా హస్తం పార్టీ కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర చిహ్నం మార్పుపై స్పందిస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వివరణ ఇచ్చింది.
Also Read: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అణువణువు అమరుల త్యాగాల ఆనవాళ్లే ఉంటాయని పేర్కొంది. కానీ ఆ ఆనవాళ్లు మచ్చుకైనా లేని ముద్ర.. తెలంగాణకి రాజముద్ర ఎలా ఆపగలదంటూ ప్రశ్నలు సంధించింది. రాజముద్రలో ఉన్న మూడు సింహాలకి, రాజుల కాలంలో నిర్మించిన కట్టడాలకి ఏమైన సారుప్యం ఉందా అంటూ ప్రశ్నించింది. 'రాజ్యం తెచ్చిన నిజమైన రాజులు ఎవరయ్యా అంటే మన తెలంగాణ అమరవీరులు. వారి ఉనికిని ప్రశ్నార్థకం చేసి, రాజ్యం ఏలే రాజులు.. మేమే తెలంగాణకు సర్వం.. సర్వస్వం అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది ప్రజా తెలంగాణ.. ఇక్కడ ప్రస్తుతం నడుస్తుంది ప్రజాపాలన. ప్రజా పాలనలో ప్రజలే మాకు దేవుళ్ళు.. వారి త్యాగాలే మాకు ఆనవాళ్ళు. ఆ ఆనవాళ్ళకు పట్టం కడుతూ మన రాజముద్రను వారి ఆశయాలకు అనుగుణంగా మార్చబోతున్నాం. జాతీయ సమగ్రత ప్రజ్వరిల్లేలా.. తెలంగాణ ప్రాభవం ఉట్టిపడేలా.. ఉద్యమ ఉనికి కళ్ళకు కట్టేలా.. ప్రతి తెలంగాణ పౌరుడు ఇది మన రాష్ట్రం అనుకునేలా మన రాజముద్ర ఉండాలనేది ఈ ప్రజా ప్రభుత్వ సంకల్పం అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
ఇక మరో ట్వీట్‌లో ' కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేసింది.'అరబుర్ర డ్రామారావుకు గుంటూరులో చదివి ఉన్నమతి పోయినట్టుంది. రాజులు కట్టినా, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కట్టినా చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడం, వాటిని గుర్తు చేసుకోవడం, చరిత్రలో ఒక భాగంగా చెప్పుకోవడం అనివార్యం. తెలంగాణ చరిత్ర అంటే రాచరికంపై, అణచివేతపై, పెత్తందారీతనం పై ప్రదర్శించిన ధిక్కారం, పోరాటం, తిరుగుబాటు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో త్యాగాలు ఉండాలి తప్ప రాజ్య భోగాలు కాదు. అణచివేతపై ప్రజల తిరుగుబాటు కనిపించాలి తప్ప నిజాం నిరంకుశ ఆనవాళ్లు కాదంటూ' పేర్కొంది.
Also Read: వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. ఎలాంటి ఏర్పాట్లంటే!