Sajjala Ramakrishna Reddy: ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా.?

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బాబు ఓ పక్క, దత్తపుత్రుడు, మరోపక్క, తన సుపుత్రుడు ఇంకోపక్క తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు.. మంచి చేస్తున్న జగన్‌ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు.

New Update
Sajjala Ramakrishna Reddy: ప్రజలకు ఏం చేశారో  చంద్రబాబు చెప్పగలరా.?

రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ బర్త్‌ డే వేడుకకు రామకృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సజ్జల.. రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేకపోయానని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు.. ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. గతంలో వైసీపీ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకగా మారుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఫ్రీ స్కీమ్‌లు ఎందుకు ప్రకటిస్తున్నారన్నారు. ఇప్పుడు సీఎం జగన్‌ ఒక్క రూపాయి ఇస్తానంటే చంద్రబాబు 100 రూపాయలు ఇస్తానని హామీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చే హామీలు హామీలుగానే మిగిలిపోతాయే తప్ప అవి అమలు కావన్నారు.

సీఎం జగన్‌ మాత్రం తాను చేయగలిగే వాటిని మాత్రమే ప్రజలకు చెబుతారని, చేయలేని పనులు కూడా చేస్తామని చెప్పి, నోరు ఉంది కదా అని హామీలు ఇచ్చి, తర్వాత వదిలేయడం ఆయన రక్తంలోనే లేదన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు గతంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి అందరికీ తెలుసన్నారు. అమరావతిలో మూడు బిల్డింగ్‌లు కట్టి రాజధానిని అభివృద్ధి చేశానని, అమరావతిని సింగపూర్‌ స్థాయిలో డెవలప్‌మెంట్‌ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. రైతులను సింగపూర్‌ ట్రిప్‌కు తీసుకెళ్లి వారితో సైతం అబద్దాలు చెప్పించారన్నారు. సీఎం జగన్‌ మాత్రం అలాంటి మోసపూరిత పనులు చేయరన్న ఆయన.. జగన్‌ తీసుకొచ్చే ప్రతీ పథకం గురించి ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్న సజ్జల.. ఎలాగైనా ప్రజలను తనవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఫ్రీ స్కీమ్‌లు ఇస్తున్నారన్నారు.

మరోవైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల.. పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ చదువుతున్నారన్నారు. రాజకీయాల్లో సినిమా డైలాగులు వేస్తున్నారన్న ఆయన.. గతంలో ఇలాంటి డైలాగులతోనే డిపాజిట్లు కూడా రాకుండా చేసుకున్నారన్నారు. ఇప్పుడు కూడా సినిమా డైలాగులు వేస్తున్నారన్న సజ్జల.. ఈ సారి కూడా పవన్‌కు 2019లో పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌, చంద్రబాబు తమ ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే ప్రభుత్వంపై నెట్టొచ్చని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేష్‌ చేస్తున్న యువగళం పాదయాత్రకు స్పందన లేదన్నారు. లోకేష్‌ పాదయాత్రలో టీడీపీ నేతలు తప్ప ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆయన.. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు అధికారంలోకి రాలేడని సజ్జల రామకృష్ణా రెడ్డి జోస్యం చెప్పారు.

Advertisment
తాజా కథనాలు