ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు (Telangana Politics) రోజురోజుకూ మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో (BRS Party) టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది హస్తం గూటికి (Congress Party) చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే తెలుస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ స్థానం కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్ ను వీడనున్నట్లు ప్రచారం సాగుతోంది. 2018 ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ టికెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. జైపాల్ యాదవ్ కు కేసీఆర్ టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
అయినా కూడా జైపాల్ యాదవ్ గెలుపుకోసం పని చేశారు. కానీ, ఈ సారి కూడా టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అనుచరులు తీవ్రంగా ఒత్తిడి తెస్తుండడంతోనే కసిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే.. ఆయన కాంగ్రాస్ లో చేరడం కన్ఫామ్ అయ్యిందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టాక్ నడుస్తోంది.
కల్వకుర్తి టికెట్ విషయమై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ మేరకు ఆయనకు హామీ కూడా లభించిందని సమాచారం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డితో కలిసి ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. మరో వైపు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ సారి టికెట్ కేటాయించకపోవడంతో మనస్థాపానికి గురైన రేఖా నాయక్ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది.
ఇది కూడా చదవండి: Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు