Brazil Floods - 100 People Died: బ్రెజిల్‌లో సంభవించిన వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వారం రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. అయితే ఈ వరదల ధాటికి ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాదాపు లక్ష ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వరదలు 14 లక్షల మందిపై ప్రభావం చూపించాయి. దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
దాదాపు 414 పట్టణాల్లో వరదలు వచ్చాయి. మరోవైపు వ్యవసాయ పంటలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. మొత్తంగా ఈ వరదల వల్ల ఇప్పటివరకు రూ.400 కోట్ల రియల్స్ మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులపై ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో లుల డా సిల్వా స్పందించారు. అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సాయం చేస్తామని తెలిపారు.
అలాగే ఈ వరదల ప్రభావానికి ఇళ్లు ధ్వంసమైపోయి.. నిరాశ్రయులైన వాళ్లకి పునరావాసం కల్పించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. వరదల ప్రభావం తగ్గేవరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం అక్కడ దాదాపు లక్షన్నర మంది సైనికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లందరూ కలిసి వరద బాధితులకు సాయం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. వరదల ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా అని బ్రేజిల్ వాసులు ఎదురుచూస్తున్నారు.
Also Read: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. కెమెరా జూమ్ ఇన్ ఆప్షన్