దేశరాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ఉదయం ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతంలోని వందకు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను బయటకు పంపించాయి. సమాచారం మేరకు వెంటనే ఆయా స్కూళ్లకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరపగా.. ఎలాంటి బాంబులు ఉన్నట్లు గుర్తించలేదు. ఢిల్లీలోని దాదాపు 100 పాఠశాలలు, నోయిడాలో రెండు పాఠశాలలకు ఈ బాంబు మెయిల్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ బాంబు బెదిరింపు మెయిల్స్ బూటకమని తెలిపింది.
Also Read: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ.. టెన్షన్ వద్దంటున్న నిపుణులు
పోలీసులు దీనిపై విచారణ చేపట్టగా.. మెయిల్‌కు పంపిన ఐపీ అడ్రస్ రష్యాకు చెందినట్లుగా ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదిలాఉండగా.. ఢిల్లీలోని చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్,సాకేత్, ద్వారక పాఠశాలలకు ముందుగా ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత మరికొన్ని పాఠశాలలకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు పలు స్కూళ్లలో ఈరోజు పరీక్షలు జరుగుతున్నాయి. బాంబు బెదిరింపు రావడంతో పరీక్షలను మధ్యలోనే ఆపేసి విద్యార్థులను ఇంటికి పంపించాయి స్కూల్ యాజమాన్యాలు.