Aamir Khan & Ranveer Singh Deepfake Video: ఇటీవల దేశవ్యాప్తంగా దుమారం రేపిన డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం ఇప్పుడు మళ్లీ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల వేళ తాజాగా బాలీవూడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ రెండు వీడియోల్లో వీళ్లిద్దరూ ప్రధాని మోదీ (PM Modi) తన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శిస్తూ.. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు (Congress) ఓటు వేయాలంటూ కోరారు. ఎన్నికల వేళ ఇలాంటి ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ఉద్యోగాలు కోల్పోనున్న 25 వేల మంది ప్రభుత్వ టీచర్లు
ఎన్నికల జరుగుతున్న సమయంలో ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు అమెరికా, పాకిస్థాన్, ఇండోనేషియాతో సహా అనేక దేశాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా భారత్‌లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ వీడియోలు బయటికి రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే భారత్‌లో 90 కోట్ల మందికి ఇంటర్నేట్ అందుబాటులో ఉంది. ప్రతి భారతీయుడు సగటున మూడు గంటల పాటు సోషల్ మీడియాలోనే సమయాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు నమ్మి చాలామంది తప్పుదారి పట్టే అవకాశాలున్నాయి.
అయితే ఈ వైరల్ వీడియోలపై సోషల్ మీడియాలో రణ్‌వీర్ సింగ్ స్పందించాడు. సోషల్ మీడియా యూజర్లకు జాగ్రత్తలు తెలిపాడు. డీప్‌ఫేక్ సో బచో దోస్తో ( డీప్ ఫేక్ పట్ల జాగ్రత్తగా ఉండండి) అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అలాగే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. విచారణ కొనసాగుతోందని రణవీర్ సింగ్ టీమ్ చెప్పింది. మరోవైపు అమీర్ ఖాన్ వీడియోపై ఆయన ప్రతినిధి స్పందించారు. అమీర్ ఖాన్ తన 35 ఏళ్ల కెరీర్‌లో ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారాలు చేయలేదని చెప్పారు.