ఎనలేని సేవలు
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కేటీఆర్ అన్నారు.
ఆత్మకు శాంతి చేకూరాలి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఆయన తెలిపారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని మంత్రి ప్రార్థించారు. సాయిచంద్ మృతిపై మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణవార్త తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నాని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు .
ఉద్యమంలో కీలక పాత్ర
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవిగాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మరణవార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సాయి చంద్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.. సాయిచంద్ స్వరం తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచింది. మంచి భవిష్యత్తు ఉన్న సాయిచంద్ మరణం తెలంగాణకు తీరని లోటు అని ఆయన తెలిపారు. సాయిచంద్ చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతున్నాను అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
కళాకారుడి గొంతు మూగపోయింది
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువ గాయకుడు, కళాకారుడి గొంతు అకాలంగా మూగ పోయిందని.. సాయిచంద్ అకాల మరణం తనను కలిచి వేసిందని వినోద్ కుమార్ అన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.
భౌతికకాయానికి నివాళులు
గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గుండెపోటుతో మృతి చెందారు. కాగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన స్వగ్రామానికి వెళ్లి సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు బోరున విలపించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సాయిచంద్ తనను ప్రేమగా అన్న పిలిచేవాడని, ఇటీవల తన ఇంటికి పిలిచి తనకు భోజనం పెట్టాడని గుర్తు చేసుకున్నారు. సాయిచంద్ లేనిదే బీఆర్ఎస్ ఏ సభ జరిగేది కాదని అన్నారు.
సొంత తమ్ముడిని కోల్పోయాము
ఈ క్రమంలోనే సాయిచంద్ కు భవిష్యత్తులో మంచి పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ తనతో చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంత చిన్న వయసులో సాయిచంద్ అందరిని వదిలి వెళ్లడం బాధాకరమని అన్నారు. ఇక మంత్రి సబిత మాట్లాడుతూ.. కొద్దికాలంలోనే సాయిచంద్‌తో అనుబంధం ఏర్పడిందని, సొంత తమ్ముడిని కోల్పోయాయని కన్నీరుపెట్టుకున్నారు. సాయిచంద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు.