BJP-TDP-Janasena Alliance: ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. ఏపీలో రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలో సమావేశం కానున్నట్లు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. పార్టీ బలాబలాలు భట్టి సీట్ల సర్దుబాటుపై సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. అధికారం కోసం పొత్తు పెట్టుకోలేదని.. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసమే ఈ పొత్తు అని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనీ అనుకుంటున్నాయని తెలిపారు. మూడు పార్టీలు కలిసి త్వరలో ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తాయని అన్నారు. పొత్తులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని పేర్కొన్నారు. పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీలో అసంతృప్తి నేతలు పెరుగుతారని.. అయినా సరే ఏపీ అభివృద్ధి కోసం పొత్తు తప్పదని ఆయన అన్నారు.
ALSO READ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. రాజ్యసభకు కమల్ హాసన్?
బీజేపీ, జనసేనకు ఎన్ని సీట్లు?
ఏపీలో సీఎం జగన్ ను గద్దె దించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇటీవల టీడీపీ జనసేన ఎన్నికల బరిలో నిలిచే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 99 మంది ఉమ్మడి అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మొదటి జాబితాలో 5 మంది జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు గతంలో ఇరు పార్టీల అధినేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పొత్తులో బీజేపీ జతకావడంతో ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాయనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ - జనసేనకు 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో బీజేపీకి 6, జనసేనకు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.