/rtv/media/media_files/2025/07/12/srikalahasti-temple-crime-news-2025-07-12-07-31-58.jpg)
Srikalahasti Temple Crime News
AP Crime: శ్రీకాళహస్తి ఆలయం రాహు-కేతు సర్పదోష నివారణ పూజల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే పవిత్ర స్థలం. కానీ ఈ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని స్వార్థానికి వాడుకునేందుకు కొంతమంది మోసగాళ్లు తెగబడుతున్నారు. మీ జాతకంలో దోషాలున్నాయి... డబ్బులు పంపితే మేమే మీ పేరుతో పూజలు చేయిస్తాం అంటూ ప్రైవేటు వ్యక్తులు భక్తులను మభ్యపెడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వివాహం, సంతాన సమస్యలతో ఆలయాన్ని ఆశ్రయించే యువ భక్తులే వీరి లక్ష్యంగా మారుతున్నారు.
జాతక దోషాల పేరుతో డబ్బులు దోచే దుర్మార్గం:
ఇటీవల ఆలయంలో పనిచేసే కొంతమంది అర్చకులకు కూడా ఈ తరహా మోసపూరిత కాల్స్ రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫోన్లు చేసే వారు భక్తుల ఫోన్ నంబర్లను ఎలా సేకరిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధానంగా శ్రీకాళహస్తి పరిసరాలలోని ప్రైవేటు లాడ్జీల్లో బస చేసే భక్తుల వివరాలు తెలుసుకుని.. వారిని మౌఖికంగా సంప్రదించి నంబర్లు పొందుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నెలల రోజుల తర్వాత ఫోన్ చేసి జాతక పరిక్షణలో దోషాలున్నాయని.. వీటి నివారణకు పూజలు అవసరమని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో వంకాయలు తింటే ప్రమాదకరమా..? ఇక్కడ వివరాలు తెలుసుకోండి
ఇలాంటి మోసాల్లో పూజలే కాకుండా హోమాలు, శాంతి పూజలు, యాగాలని చెప్పి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ముక్కంటి ఆలయంలో పనిచేసే అర్చకుని కుటుంబ సభ్యుడికి వచ్చిన ఫోన్‌కాల్ ఈ మోసపు వ్యవహారాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఆ వ్యక్తి ఆలయం పరిధిలో కాకుండా బయట ప్రాంతంలో ఉండటం గమనార్హం. దీనిని బట్టి భక్తుల వివరాలు ఒక నిర్దిష్ట పద్ధతిలో సేకరించబడుతున్నట్లు భావించవచ్చు. దేవాదాయ శాఖ ఇప్పటికే పరోక్ష సేవలు, ఆన్‌లైన్ ద్వారా భక్తులకు సులభతరంగా పూజల అవకాశం కల్పిస్తోంది. అయినప్పటికీ కొంతమంది అమాయకులు ఈ ప్రైవేటు మోసాలకు బలవుతున్నారు. అధికారిక వేదికలపై మాత్రమే పూజలకు నమోదు చేసుకోవాలని.. ఎలాంటి ఫోన్‌కాల్‌లను నమ్మరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి భక్తులు కూడా అప్రమత్తంగా ఉండి ఆధ్యాత్మిక విశ్వాసాన్ని వ్యాపారంగా మలుచుకునే దుర్మార్గుల మోసాల నుంచి తమను తాము కాపాడుకోవాలి.
ఇది కూడా చదవండి: శ్రావణ మాసంలో ఐదు కలలు చాలా శుభప్రదం..శివుని ఆశీర్వాదంతోపాటు...!!
( AP Crime | ap crime latest updates | ap crime updates | ap-crime-news | Latest News | telugu-news )