/rtv/media/media_files/2025/09/19/onion-prices-have-fallen-2025-09-19-10-56-09.jpg)
Onion prices have fallen
Onions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లిధరలు పతనమయ్యాయి. కోయకుండానే రైతులను ఏడిపిస్తున్నాయి. ఏపీలో ఉల్లి పంట రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. కిలో ఉల్లిపాయల ధరలు కేవలం 30 పైసలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఉల్లిధరలు ఒక్కసారిగా పతనమవ్వడంతో రైతులు లభోదిబోమంటున్నారు.కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే రాయలసీమ జిల్లాల్లో ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏపీ మార్క్ ఫెడ్ ఉల్లికి క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు చేసింది. వీటిని కర్నూలు మార్కెట్‌లో గురువారం వేలం వేయగా... క్వింటా ఉల్లిని కనిష్ఠంగా రూ.50కు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే.. కిలో ఉల్లి 50 పైసలు పలికిందన్న మాట..! గరిష్ఠంగా క్వింటా రూ.400 పలికింది. వేలంలో ఎక్కువ శాతం రూ.100లోపే కొనుగోలు చేశారు. అయితే బహిరంగ వేలంలో పాల్గొన్న వ్యాపారులు ముందే కుమ్మక్కై ఇలా అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు మార్కెట్ చరిత్రలోనే ఉల్లి ధర ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి అని అన్నదాతలు చెబుతున్నారు. గత సంవత్సరం ఉల్లి రైతులకు క్వింటాలుకు ఆరువేల రూపాయల వరకు ధర పలికింది. ఈ సంవత్సరం కూడా మంచి ధర వస్తుందని ఉల్లిరైతులు పెద్ద ఎత్తున ఉల్లిని సాగు చేశారు. అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు మాత్రం పలకడం లేదు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిరైతులకు ఊరట నిచ్చేలా ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి 6,057 టన్నులు (60,570 క్వింటాళ్లు) ప్రభుత్వం సేకరించింది. అందులో 3,707 టన్నులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న రైతు బజార్లకు సరఫరా చేశారు.. మరో 2,350 టన్నుల ఉల్లి బస్తాలు కర్నూలు మార్కెట్‌లోనే ఉండిపోయాయి. దీంతో రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లిని కనీసం టెండరుకు ఉంచేందుకు మార్కెట్‌లో స్థలం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బి.నవ్య ఆదేశాల మేరకు ఏపీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలకు కర్నూలు మార్కెట్ యార్డులో బహిరంగ వేలం నిర్వహించారు. మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ మేరకు ఈ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో క్వింటా ఉల్లి కనిష్ఠంగా రూ.50 నుంచి గరిష్ఠంగా రూ.400 వరకూ ధర పలింది.
అది కూడా ఎక్కువ శాతం క్వింటాలుకు రూ.100 పలికింది.అయినామొత్తం 492 టన్నులు (4,920 క్వింటాళ్లు) మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. వ్యాపారులు వ్యూహం ప్రకారమే వేలంలో పోటీ పడలేదని తెలుస్తోంది. దీంతో వచ్చినకాడికి ఇచ్చేయాల్సి వచ్చింది. దీంతో మార్క్‌ఫెడ్‌కు కిలోకు రూపాయి కూడా రాలేదని తెలుస్తోంది. కాగా, ఇదే ఉల్లిని వ్యాపారులు బయట కిలో రూ.10-20కు పైగా విక్రయిస్తున్నారు. కర్నూలులో బహిరంగ మార్కెట్‌లో నాలుగు కిలోలు రూ.100 చొప్పున అమ్ముతున్నారు. కాగా, ప్రభుత్వం సేకరించిన ఉల్లి బస్తాలను సకాలంలో బయటకు తరలించకపోవడంతో నిల్వచేసిన ప్లాట్‌ఫాం, గోదాముల్లోనే దాదాపు 200 టన్నులు ఉల్లి కుళ్లిపోతోందని అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తూ ఉండడంతో పంట కూడా కుళ్ళిపోతుంది. ఉల్లిని కర్నూలు మార్కెట్ కి తీసుకువెళ్తే కొనే దిక్కులేక సరుకును తిరిగి తీసుకు వెళ్లలేక రైతులు అక్కడే వదిలిపెట్టి వెళుతున్నారు. మరోవైపు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న ఉల్లిని కొనే నాథుడే లేకుండా పోయాడు. దీంతో ఏపీలో ఆరుగాలం శ్రమించి ఉల్లిని సాగు చేస్తున్న రైతన్న ధర లేక అల్లాడి పోతున్నాడు. పెట్టిన పెట్టుబడి కూడా రాదని లబోదిబోమంటున్నాడు.
ఇది కూడా చూడండి: Japanese Health Secret: జపాన్‌లో లక్ష మందికి 100 ఏళ్లకు పైగా ఆయుష్షు.. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?