Nellore Road Accident
AP Crime: నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ముంబయి జాతీయ రహదారిపై పొతిరెడ్డిపాలెం వద్ద చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వైద్య విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా కారు పెట్రోల్ బంకు సమీపంలో అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు, 108కు సమాచారం అందించారు.
అతి వేగంతో..
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఐదుగురు విద్యార్థులు మరణించారు. మృతులు జీవన్, విఘ్నేష్, నరేశ్, అభిసాయి, అభిషేక్‌లు కాగా మరో విద్యార్థి మౌనిత్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ యువకులు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. వారి ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు, స్నేహితుల్లో తీవ్ర విషాదం మిగిల్చింది.
ఇది కూడా చదవండి: మానసిక స్థితిని మెరుగుపరిచే అద్భుతమైన ఆహారాలు
డ్రైవింగ్ సమయంలో వేగం నియంత్రించుకోవడం, రహదారుల వద్ద తగిన హెచ్చరికల ఉండకపోవడం, డ్రైవర్ అజాగ్రత్త వంటి కారణాలు ఇలాంటి సంఘటనలకు దారి తీస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబాలు కోరుతున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కారు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఐస్ ముక్కలు తింటున్నారా.. మీకు ఐరన్ లోపం ఉన్నట్టే
( crime news | crime | latest-news | telugu-news)