తెలంగాణలో అఘోరీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అక్కడి నుంచి వెళ్లిపోయిన అఘోరీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది. తాజాగా శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుంది. కానీ పోలీసులు ఆమెను ఆలయంలోకి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అఘోరీ పోలీసులపై ఫైర్ అయింది. ఈ క్రమంలోనే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అక్కడున్న లేడీ సెక్యూరిటీ అఘోరీపై నీళ్లుపోసి బట్టలు కట్టే ప్రయత్నం చేయగా.. తాను అఘోరీనని బట్టలు కట్టను అంటూ అరుపులు అరిచింది.
గన్‌తో షూట్ చేసి చంపేయండి
అనంతరం అఘోరీ పోలీసులతో మాట్లాడింది. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపింది. కావాలంటే గన్‌తో షూట్ చేసి చంపేయండి అంటూ మండిపడింది. ఇప్పటివరకు తనను ఎవరు అడ్డుకోలేదని.. మీ పోలీసుల పని తనను అడ్డుకోవడమా అని ప్రశ్నించింది.
రాష్ట్రంలో చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారని అడిగింది. మీ పోలీసులు ఉన్నది కేవలం నటించడానికే కానీ ప్రజలకు సేవ చేయడానికి కాదు అని ఫైర్ అయింది. ఈ మేరకు తాను చట్టాన్ని నమ్మనని.. కేవలం తన ధర్మాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొంది. అయితే నగ్నంగా దర్శనానికి అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు చెప్పి.. అఘోరీని అంబులెన్స్‌లో అక్కడి నుంచి పంపించేశారు.
టోల్ ప్లాజా వద్ద హల్ చల్
కాగా ఇటీవల తెలంగాణ నుంచి వెళ్లిపోయిన అఘోరీ రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో దర్శనమిచ్చింది. ఊహించని విధంగా సోమవారం సాయంత్రం విశాఖ దగ్గరలో నక్కపల్లి మండలంలో హల్చల్ చేసింది. తన కారులో అన్నవరం నుంచి విశాఖవైపు వస్తూ వేంపాడు టోల్ ప్లాజా వద్ద ప్రత్యక్షమైంది.
దీంతో ఆత్రంగా స్థానికులు, టోల్ ప్లాజా సిబ్బంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి తనపై చేయి వేసి, తాకరాని చోట తాకాడంటూ ఆమె గొడవకు దిగింది. అతనెవరో తనకు తెలియాలని, సీసీ కెమెరా పుటేజీ కావాలని డిమాండ్ చేసింది.
Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే
ఈ సందర్భంగా లేడీ అఘోరీ మాట్లాడుతూ ఏపీలో కూడా మహిళలకు రక్షణ లేదని, నిత్యం శివ సాన్నిధ్యంలో వుండే తనపై అసభ్యంగా ప్రవర్తిస్తే, మహిళలకు రక్షణ ఎక్కడ వుంటుందని పేర్కొంది. తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసమే కృషి చేస్తున్నానని తెలిపింది. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనని.. అవసరమైతే ప్రాణత్యాగం అయినా చేస్తానని చెప్పింది. తనలాంటి నాగ సాదువులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. ఈ లోగా అక్కడకు చేరుకున్న సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు ఆమెకి సర్దిచెప్పి పంపించేశారు.