/rtv/media/media_files/2025/10/20/koyyuru-zptc-member-nukaraju-murdered-2025-10-20-19-33-27.jpg)
Koyyuru ZPTC member Nukaraju murdered
Big breaking : అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. భూ వివాదం నేపథ్యంలో జడ్పీటీసీపై కొంతమంది కత్తులతో దాడిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద నూకరాజుకు పది ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి విషయంలో గిరిజనులకు, ఆయనకు గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని కొందరు గిరిజనులు ఆ భూమి తమ సొంతం అంటూ పలుమార్లు గొడవకు దిగినట్లు తెలుస్తోంది. మధ్యవర్తిత్వం చేసేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నించినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఈ వివాదం రక్తపాతానికి దారితీసింది.
Also Read : ఆమె శాపంతో వందేళ్లుగా ఈ గ్రామంలో దీపావళి జరగట్లేదు
గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఆయన ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దాదాపు నెల రోజులపాటు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ గొడవల నేపథ్యంలో పోలీసులు పలువురిపై బైండోవర్ కేసులు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నూకరాజు మరోసారి తన భూముల వద్దకు వెళ్లడంతో గిరిజనులతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మాట మాట పెరిగి గిరిజనులు ఆయనను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోలుగుంట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చటర్జీపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భూమి వివాదం కోణంలోపాటు, రాజకీయ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.
Also Read : పండగ వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. NHAI కీలక ప్రకటన