/rtv/media/media_files/2025/10/18/himachal-village-2025-10-18-19-57-33.jpg)
దేశం మొత్తం దీపాలు, టపాసులు, ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్న వేళ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామం మాత్రం శతాబ్దాలుగా ఈ పర్వదినానికి దూరంగా ఉంటోంది. హమీర్‌పూర్ జిల్లాలోని సమ్మూ గ్రామ ప్రజలు, ఓ మహిళ ఇచ్చిన శాపం కారణంగా తరతరాలుగా దీపావళి వేడుకలను బహిష్కరిస్తున్నారు. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్థానికుల కథనం ప్రకారం, వందల సంవత్సరాల క్రితం, సమ్మూ గ్రామానికి చెందిన ఓ గర్భిణీ స్త్రీ దీపావళి పండుగకి సిద్ధమైంది. అదే రోజు స్థానిక రాజు సైన్యంలో పనిచేస్తున్న తన భర్త మరణవార్త వినాల్సి వచ్చింది. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ మహిళ, తీవ్ర దుఃఖంతో భర్త చితిపై సతీసహగమనం చేసింది. భర్త చితి మంటల్లోకి దూకే ముందు, సమ్మూ గ్రామ ప్రజలు ఎప్పటికీ దీపావళి పండుగ చేసుకోకూడదని శపించిందట. నాటి నుంచి నేటి వరకు, ఈ గ్రామంలో దీపావళి పండుగను జరుపుకోవడానికి గ్రామస్థులు భయపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా దీపాలు వెలిగించినా, బాణాసంచా కాల్చినా లేదా ప్రత్యేక వంటకాలు చేసినా ఏదో ఒక అపశకునం, ప్రమాదం జరుగుతుందని, ప్రాణ నష్టం సంభవిస్తుందని వారు బలంగా నమ్ముతారు. గతంలో ఒక కుటుంబం శాపాన్ని లెక్కచేయకుండా పండుగ జరుపుకోవడానికి ప్రయత్నించగా, వారి ఇల్లు అగ్నికి ఆహుతైందని గ్రామ పెద్దలు చెబుతున్నారు.
దీంతో దీపావళి రోజున ఆ గ్రామంలో ఇళ్లు చీకటిగా ఉండి, పండుగ వాతావరణం కనిపించదు. ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి అనేక పూజలు, యజ్ఞాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అందుకే సమ్మూ గ్రామస్థులు ఇప్పటికీ తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ దీపావళికి దూరంగా ఉంటున్నారు.