Russia : అంతరిక్షంలోకి ఉపగ్రహాలు(Satellites Into Space) పంపించేందుకు పలు దేశాలు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా రష్యా(Russia) పై సంచలన ఆరోపణలు చేసింది. రష్యా.. ఉపగ్రహాన్ని విధ్వంసం చేసే ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని.. అమెరికా(America) ప్రకటన చేసింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం అని పేర్కొంది. అయితే ఆ ఆయుధాన్ని ఇంకా ప్రయోగించలేదని.. ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు.
వాస్తవాలను బయటపెట్టాలి
అయితే రష్యా రహస్యంగా ఓ ఆయుధాన్ని తయారుచేస్తున్నట్లు అమెరికా ఇంటిలిజెన్స్‌కు తెలిసిందని.. ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ మైక్ టర్నర్(Mike Turner) స్పందించారు. దీనిపై వాస్తవాలను బయటపెట్టాలని అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) యంత్రాంగాన్ని ఆయన బుధవారం డిమాండ్ చేశారు. ఆ ఆయుధం వల్ల కలిగే పర్యవసానాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ తరుణంలో ఈ వార్తల్ని వైట్‌హౌస్ ధృవీకరించింది. ప్రస్తుతం ఇంతకు మించి తమ వద్ద సమాచారం లేదని పేర్కొంది.
Also Read : రేపు జీఎస్ఎల్వీ ఎఫ్-14 ప్రయోగం
భూ కక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు
రష్యా అభివృద్ధి చేస్తున్న శాటిలైట్ విధ్వంసక ఆయుధానికి అణ్వస్త్ర సామర్థ్యం కూడా ఉన్నట్ల ఇటీవల వార్తలు రాగా.. వాటిపై మాత్రం జాన్ కిర్బీ స్పష్టత ఇవ్వలేదు. అయితే దీనిపై ఇప్పుడే ప్రమాదం లేకపోయినప్పటికీ.. భూ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు మాత్రం ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు దిగువ కక్ష్యలో ఉండే వ్యోమగాములకు కూడా ఇది ప్రమాదమని చెప్పారు. అయితే అంతరిక్షం నుంచి కూడా భూమిపై దాడి చేసే సామర్థ్యం ఆ ఆయుధానికి ఉందని మాత్రం చెప్పట్లేదని పేర్కొన్నారు. అయితే రష్యా వాళ్లు ఈ ఆయుధాన్ని తయారుచేయడం కొన్ని నెలల క్రితమే ప్రారంభించారని చెప్పారు.
స్పేస్ స్టేషన్‌కు ముప్పు
ఈ ఆయుధానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని జో బైడెన్‌కు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకోవాలని బైడెన్ చెప్పినట్లు తెలిపారు. అయితే ఒకవేళ రష్యా ఈ ఆయుధాన్ని అంతరిక్షంలోకి పంపితే చాలా ప్రమాదకరమని అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ స్పేస్ అండ్ డిఫెన్స్(American Enterprise Institute Space And Defense) బడ్జెట్ నిపుణుడు టాడ్ హారిసన్ అన్నారు. భూ దిగువ కక్ష్యలో అణ్వస్త్ర ప్రయోగం వల్ల ఉపగ్రహాలన్నీ దెబ్బ తింటాయని పేర్కొన్నారు. అంతేకాదు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ప్రభావితమవుతుందని అన్నారు. దీనివల్ల ఇందులో ఉండే ఆస్ట్రోనాట్‌లకు ముప్పు తప్పదని.. అంతరిక్షంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: అప్పుల్లో అమెరికా.. మాంద్యంలో జపాన్..ఇంగ్లండ్.. వృద్ధి బాటలో భారత్!