దేశం ఆశ్చర్యపోయేలా చేస్తాం: సీఎం కేసీఆర్

విపక్షాలకు సీఎం కేసీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల పరిస్థితి, తెలంగాణ పరిస్థితి ఎలాగుందో చూసుకోవాలన్నారు. ప్రగతిలో బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు తెలంగాణ దరిదాపుల్లో లేవని స్పష్టం చేశారు.

New Update
దేశం ఆశ్చర్యపోయేలా చేస్తాం: సీఎం కేసీఆర్

అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్‌ దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ప్రజలను అయోమయానికి గురిచేయాలని చూస్తున్నారన్నారు. 24 గంటల విద్యుత్‌పై కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని దశాబ్దాలుగా కొట్లాడినట్లు గుర్తు చేసిన కేసీఆర్‌.. రాష్ట్రం ఏర్పడిన అనంతరం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని గుర్తు చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. 4 లక్షల 1 వేయి పైచిలుకు ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రికార్డు తమదన్నారు.

బలహీన వర్గాల ఇళ్లకు సంబంధించిన బకాయిలను గత ప్రభుత్వాలు ముక్కుపిండి వసూళ్లు చేశాయన్న సీఎం.. తమ ప్రభుత్వం మాత్రం వారి ఇళ్ల బకాయిలను మాఫీ చేశామన్నారు. గొల్ల కురుమ సోదరులకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో పింక్‌ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, గ్రీన్‌ రెవల్యూషన్, వైట్‌ రెవల్యూషన్ ఇచ్చామన్నారు. పాడి రైతులకు లీటర్‌కు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులను ఇతర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న సీఎం.. తాము వారిసంక్షేమానికి పెద్ధపీట వేశామన్నారు.

ఎన్నికల సమయంలోనే బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ప్రజల వద్దకు వస్తారన్నారు. ఇటీవల కర్నాటక ఎన్నికల సమయంలో బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోడీ.. ఇంటికి అర లీటర్‌ పాలు, ఉచిత సిలిండర్‌ ఇస్తామని అనేక హామీలు ఇచ్చినా ప్రజలు వారిని నమ్మలేదన్నారు.

మరోవైపు ఇటీవల ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ వృద్ధులకు, వికలాంగులకు పింఛన్‌ 4 వేలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం కర్నాటకలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేక పోయిందని మండిపడ్డారు. ఖజానాలో డబ్బులు లేక ఎస్సీ, ఎస్టీ నిధులను పింఛన్‌ వైపు తరలిస్తున్నారన్నారు. కర్నాటకతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌లో వెయ్యికి మించి పింఛన్‌ ఇవ్వడంలేదన్న కేసీఆర్‌ తెలంగాణలో 4 వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేర్చిందన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నీటిలోమూటలే అని సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను ప్రజల గతంలో నమ్మలేరని, ఇకపై కూడా నమ్మరని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రాబోయ్యేది బీఆర్ఎస్‌ ప్రభుత్వమే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు