Pakistan Cricketer Haider Ali: ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్ట్.. ఎందుకంటే?

పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీ, ఇంగ్లాండ్‌లో అత్యాచార ఆరోపణల మీద అరెస్ట్ అవడం పాక్ క్రికెట్ వర్గాలను కుదిపేసింది. పాకిస్తాన్ A జట్టు అయిన 'పాకిస్తాన్ షాహీన్స్'తో కలిసి UK పర్యటనలో ఉన్న 24 ఏళ్ల హైదర్ అలీని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Haider Ali

పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీ, ఇంగ్లాండ్‌లో అత్యాచార ఆరోపణల మీద అరెస్ట్ అవడం పాక్ క్రికెట్ వర్గాలను కుదిపేసింది. పాకిస్తాన్ 'A' జట్టు అయిన 'పాకిస్తాన్ షాహీన్స్'తో కలిసి యూకే పర్యటనలో ఉన్న 24 ఏళ్ల హైదర్ అలీని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని బెయిల్‌పై విడుదల చేసినప్పటికీ, అతని పాస్‌పోర్ట్‌ను మాత్రం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసు విషయంలో యూకే చట్టాలకు పూర్తి సహకారం అందిస్తామని, అలాగే హైదర్ అలీకి న్యాయ సహాయం అందిస్తామని పీసీబీ తెలిపింది. దర్యాప్తులో అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత, బోర్డు అతనిపై తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

జులై 23న మాంచెస్టర్‌లోని ఓ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు వెల్లడించారు. ఒక 24 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు తర్వాత బెయిల్‌పై విడుదల చేశామని పోలీసులు తెలిపారు. ఇంగ్లాండ్ చట్టాల ప్రకారం ఈ దశలో నిందితుల పేర్లను పోలీసులు అధికారికంగా వెల్లడించరు. అయితే, అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, బాధితురాలు ప్రవాస పాకిస్తానీ యువతి అని తెలుస్తోంది.

హైదర్ అలీ కెరీర్:
హైదర్ అలీ 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను రెండు వన్డేలు, 35 టీ20 మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు కూడా, 2021లో పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి సస్పెండ్ అయ్యాడు.

గతలో పాకిస్తాన్ క్రికెటర్లు 2010లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లోనే జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు హైదర్ అలీ కేసుతో మరోసారి పాకిస్తాన్ క్రికెట్‌పై నేరారోపణలు వచ్చాయి. 

Advertisment
తాజా కథనాలు