Shock To Pakistan : టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) లో సంచలనాలు నమోదవ్వడం మొదలైంది. అస్సలు అంచనాలు లేని జట్లు పెద్ద విజయాలు దక్కించుకుంటున్నాయి. పెద్ద జట్టు అయిన పాకిస్తాన్ (Pakistan) ను అతి చిన్న జట్టు... ఇప్పటివరకు ఎవరికీ తెలియని అమెరికా టీమ్ (USA Team) గెలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. గ్రూప్ ఎలో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమెరికా సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. తరువాత లక్ష్య ఛేదనకు దిగిన అమెరికా 3 వికెట్ల నష్టానికే 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. తరువాత ఇరు జట్లకూ మధ్య సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. దీంతో పాక్‌కు 19 పరుగులు లక్ష్యం అయింది. ఈ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడింది. ఒక వికెట్ కోల్పోయి 13 రన్స్ మాత్రమే చేయగలిగింది. దాంతో మ్యాచ్ అమెరికా ఎగురేసుకుని పోయింది.
టీమ్ అమెరికా మొదటి నుంచి ఎక్కడా తడబడకుండా మంచి ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ (Monank Patel) 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. తరువాత వచ్చిన ఆండ్రీస్ గౌస్ 35, ఆరోన్ జోన్స్ 25, నితీశ్ కుమార్ 14 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో నాలుగు సింగిల్స్, ఓ సిక్స్ వచ్చాయి. చివరి బంతికి నితీశ్ ఫోర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అమిర్, నసీమ్ షా, హరిస్ రవూఫ్ తలో వికెట్ పడగొట్టారు.
పాకిస్తాన్ టీమ్‌లో కెప్టెన్ బాబర్ ఆజామ్ 44, షాదాబ్ ఖాన్ 40, ఇఫ్తికార్ అహ్మద్ 18, షాహీన్ అఫ్రిది 23 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో కెంజిగే 3, నేత్రవల్కర్ 2, అలీ ఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. మొత్తానికి నిన్నటి మ్యాచ్ వరల్డ్‌కప్‌లో సంచలనంగా నిలిచింది.
Also Read : అంతర్జాతీయ కెరీర్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన సునీల్ ఛెత్రి