జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోవాలని మోదీ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌లో గతంలో పనిచేసిన ఇద్దరు బీజేపీ నేతలను అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరు నేతలు 'మిషన్ కశ్మీర్' ను నడిపించనున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగనున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కడ అధికారం దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ.. తమ వ్యూహాలకు పదును పెట్టింది. కిషన్ రెడ్డి గతంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయనకు కశ్మీర్ మైనారిటీలతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే 2014లో జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వచ్చింది. దీంతో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP)- బీజేపీ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అప్పుడు పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్న రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు.
Also Read: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. కోల్‌కతా హత్యాచార నిందితుడు ట్విస్ట్
ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌తో గతంలో పనిచేసిన అనుభవం కలిగిన ఈ ఇద్దరు తెలుగు నేతలను బీజేపీ తమ ఎన్నికల అస్త్రంగా ఎంచుకుంది. కిషన్‌రెడ్డికి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అలాగే రామ్ మాదవ్‌కు కో - పోల్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి కిషన్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అక్కడ గతంలో జరిగిన ఎన్నికల్లో జమ్మూ ప్రాంతాల్లో బీజేపీ 25 స్థానాల్లో గెలిచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ హిందూ కమ్యూనిటీ ఉంటుంది. దీంతో ఈసారి జరగనున్న ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలో మరిన్ని సీట్లు గెలిచేలా చేసేందుకు కిషన్ రెడ్డి దృష్టిసారించనున్నారు.
అయితే కొన్ని హిందూ గ్రూప్‌లు బీజేపీకి దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో వాళ్లను కలుపుకునేందుకు బీజేపీ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిచేలా కిషన్ రెడ్డి, రామ్ మాదవ్‌లు కీలక పాత్ర పోషించగలరని పార్టీ భావిస్తోంది. ఇదిలాఉండగా జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18న, 25న అలాగే అక్టోబర్ 1న మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, పీడీపీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. ఆర్టికల్ 390 రద్దు తర్వాత అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read: ఒక్కరు కాదు చాలామంది ఉన్నారు.. అభయ తల్లిదండ్రుల సంచలన ఇంటర్వ్యూ