తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీకి భారీగా వసూళ్లు వచ్చాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు తిరిగొచ్చే వారి సౌకర్యం కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను కేటాయించింది. దీంతో ఆర్టీసీకి దాదాపు 25 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రణాళికబద్ధంగా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసులు నడిపించడం వల్ల ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. తెలంగాణకు మాత్రమే కాదు అటూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఈ ఏడాది టీఎస్‌ఆర్టీసీ ఏకంగా 5,500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అదనంగా మరో 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం విశేషం. ప్రయాణికుల కోసం హైదరాబాద్‌లోని ప్రధాన బస్ స్టేషన్లైన ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో సహా సీబీఎస్, దిల్‌షుక్‌నగర్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ.. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరా ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది.
మరో విషయం ఏంటంటే ఈసారి టీఎస్‌ఆర్టీసీ డైనమిక్ ఛార్జీలను కూడా తీసుకొచ్చింది. గతంలోనే డైనమిక్ ఛార్జీలు వసూలు చేసినప్పటికీ.. దసరా పండుగ నేపథ్యంలో ఇవి కలిసొచ్చాయి. ప్రయాణికులు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఛార్జీలు వసూలు చేయండం, అలాగే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ వసూలు చేయడమే ఈ డైనమిక్ ఛార్జీల ఉద్దేశం. ముఖ్యంగా బెంగళూరు, వైజాగ్, విజయవాడ, చెన్నై వంటి నగరాలకు వెళ్లే వారు డైనమిక్ ఫేర్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చి చూస్తే.. డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండడం వల్ల చాలామంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపినట్లు అధికారులు చెప్పారు.
Also Read: మేడిగడ్డ బ్యారేజీపై పోలీసుల కీలక ప్రకటన.. ఏం అన్నారంటే..
వాస్తవానికి ఆర్టీసీ అక్టోబర్ 13 నుంచి 24 వరకు అంటే దాదాపు 11 రోజుల వరకు ప్రత్యేక బస్సులను నడిపించింది. అంతేకాదు తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతిరోజూ ఆర్టీసీకి దాదాపు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రతిరోజూ అదనంగా సుమారు 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. అత్యధికంగా రూ.19 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ 11 రోజుల్లో ఆర్టీసీకి మొత్తం 25 కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయం వచ్చినట్లు సమాచారం.
Also Read: 50 వేల మెజార్టీకీ ఒక్క ఓటు తగ్గినా.. రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్