TMC Boycott 3 TV Channels : పశ్చిమ బెంగాల్ (West Bengal) లో ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఏబీపీ అనంద, రిపబ్లిక్ టీవీ, టీవీ9 ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. బెంగాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తమ ప్రతినిధులను ఈ మూడు ఛానల్స్‌లకు పంపించమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. '' బెంగాల్ వ్యతిరేక ఎజెండాతో నిరంతరం ప్రచారాలు చేస్తున్న ఏబీపీ అనంద, రిపబ్లిక్, టీవీ9 ఛానల్స్‌కు తమ ప్రతినిధులను పంపించకూడదని ఏఐటీఎంసీ నిర్ణయించింది. ఈ ఛానల్స్‌ను నడిపించేవారు, వారి ప్రమోటర్లు ఈడీ కేసులను, విచారణలను ఎదుర్కొంటున్నారు. అందుకే వీళ్లకు ఢిల్లీ జమిందారులను బుజ్జగించాల్సిన అవసరం ఉంది.
Also Read: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!
అలాగే టీఎంసీ మద్దతుదారులుగా చెప్పుకునే వారు ఈ ఛానల్స్‌లో చర్చలు జరిపితే వారి మాటలు నమ్మొద్దని మేము బెంగాల్ ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే వీళ్లకు పార్టీ నుంచి ఎలాంటి అధికారం లేదు. మా పార్టీ వైఖరికి వీళ్లు ప్రాతినిధ్యం వహించరు. బెంగాల్ ప్రజలు ఇలాంటి అపవిత్ర బంధాన్ని ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంటారు. ప్రచారాల కంటే సత్యాన్నే కోరుకుంటారు'' అని ఆల్ ఇండియా తృణములు కాంగ్రెస్ (AITC) ఎక్స్‌లో పేర్కొంది. మరోవైపు టీఎంసీ.. ఈ మూడు న్యూస్ ఛానల్స్‌ను బహిష్కరించడంపై బీజేపీ కూడా ఎక్స్‌లో స్పందించింది. టీఎంసీ ఎప్పుడూ కూడా నియంత పాలనను ప్రదర్శిస్తోందని.. భావ ప్రకటన స్వేచ్ఛను వ్యతిరేకిస్తోందని విమర్శించింది. మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వస్తున్న నేపథ్యంలో, సత్యాన్ని ఎదుర్కొనే సమర్థత లేకపోవడం వల్లే ఈ న్యూస్ ఛానల్స్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది.
Also Read: లిక్కర్ కేసులో మరో నిందితుడికి ఊరట.. సుప్రీకోర్టు బెయిల్ మంజూరు
ఇదిలాఉండగా ఇటీవల కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) లో జూనియర్ డాక్టర్‌పై హత్యచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది. మరోవైపు బీజేపీ కూడా మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు భద్రతను కేటాయించడంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. దీంతో టీఎంసీ పార్టీ.. బీజేపీ ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై కావాలనే బురద జల్లతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ వ్యతిరేక ఎజెండాతో ఏబీపీ అనంద, రిపబ్లిక్, టీవీ9 న్యూస్ ఛానల్స్ ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ వాటిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.