ఎలక్ట్రిక్ కార్లలో ఓ పెద్ద సంచలనం టెస్లా కార్లు. అటానమస్ కార్ల తయారీలోనూ ఈ కంపెనీ ముందుంది. లాస్ట్ ఇయర్ తమ సంస్థ నుంచి ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబో కూడా వస్తుందని ప్రకటించారు. తాజాగా దానికి సంబంధించిన వీడియోను తమ అధికారి ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోలో రోబో అన్ని వస్తువులను సులువుగా పట్టుకోవడం, మనిషి కంటే వేగంగా వాటిని క్రమబద్దం చేయడం లాంటి పనులను ఈజీగా చేసేస్తోంది. దీంతో పాటూ నమస్కారం పెట్టడం, యోగా లాంటివి కూడా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
హ్యూమనాయిడ్ రోబో చేస్తున్న పనుల మధ్యలో మనిషి వచ్చి మార్పులు చేసినా, వాటిని మరింత కష్టతరం చేసినా కూడా పరిస్థితిని అర్ధం చేసుకుని దానికి తగ్గట్టు పనిచేయగలుగుతోంది. యోగాలో పలు రకాల భంగిమలను ప్రదర్శిస్తోంది. ఈ రోబో తన కాళ్ళు, చేతుల మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంది. టెస్లా లానే న్యూరల్ నెట్ వర్క్ ద్వారా వీడియో ఇన్ పుట్ ను పూర్తిగా సమీక్షించి తదనుగుణంగా ఔట్ పుట్ ను అందిస్తోంది. కలర్స్ ను గుర్తించడం లాంటి వాటిల్లో కూడా ఈ రోబో నైపుణ్యం సంపాదించుకుంది.
టెస్లా పెట్టిన ఈ వీడియో మీద ఆ కంపెనీ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. హ్యూమనాయిడ్ రోబో తయారీలో చాలా పురోగతి సాధించామని చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పాపులర్ అవుతోంది. టెస్లా నుంచి మరో అద్బుతమైన సృష్టి అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. మస్క్ మామ మాములోడు కాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోబో కోసం వెయింటింగ్ అంటూ చెబుతున్నారు. అయితే టెస్లా మాత్రం హ్యూమనాయిడ్ రోబోను వినియోగంలోకి ఎప్పుడు తీసుకువస్తారనేది మాత్రం ప్రకటించలేదు.
కాలిఫోర్నియాలో లాస్ట్ ఇయర్ ఒక ఈవెంట్ లో హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ టెక్నాలజీని ప్రదర్శించారు. అప్పుడే ఎలాన్ మస్క్ త్వరలోనే సెక్సీ రోబోలను సృష్టిస్తామని ప్రకటించారు కూడా. అలాగే ఈ ఏడాది మార్చిలో ఇన్వెస్టర్ డే సందర్భంగా ఐదు రోబోలను ప్రదర్శించింది టెస్లా. ఇప్పుడు ఆరునెలల లోపే అందులో మరింత పురోగతి సాధించింది.