సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయ ముట్టడికి ఏఐఎస్ఎఫ్‌ విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై బైటాయించిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.

New Update
సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ సెక్రటేరియట్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హస్టల్‌ల్లోకి మీడియాను, విద్యార్థి సంఘాలను రానివ్వకుండా ప్రభుత్వం ఆక్షలు విధించింది. దీనికి నిరసనగా ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తుండటాన్ని గమనించిన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై బైటాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను  అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. మరోవైపు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు.. ప్రభుత్వం మీడియా హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లోకి విద్యార్థి సంఘాలను, మీడియాను ఎందుకు అనుమతిండచంలేదని ప్రశ్నించారు. 

తమ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తుందని, అందుకోసం కొత్త భవనాలు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న విద్యాశాఖ.. మరి మీడియా వస్తే వారికి భయం ఎందుకన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తోందన్న ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి నేతలు.. విద్యార్థి సంఘాలు, మీడియా విద్యాలయాల్లోకి వస్తే తమ బండారం బయట పడుతుందని, అందుకే తమను,  మీడియాను విద్యాలయాల్లోకి అనుమతివ్వడంలేదని ఆరోపించారు.  అద్భుతంగా సెక్రటేరియట్‌ నిర్మించుకున్న కేసీఆర్‌ సర్కార్.. సచివాలయ భవనంలోని ప్రతి మూలకు వెళ్లొచ్చని మీడియాకు చెప్పిందన్నారు. మీడియా సచివాలయంలోకి వెళ్లి ప్రభుత్వం గురించి గొప్పగా చెబుతుంది కాబట్టి రాష్ట్ర సర్కార్‌ సచివాలయంలోకి మీడియాకు అనుమతిచ్చిందన్నారు.

కానీ ప్రభుత్వ విద్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయన్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నేతలు.. మీడియా పాఠశాల భవనాల  గురించి ఆరాతీస్తే ప్రభుత్వంపై విపక్ష పార్టీలు విమర్శలు చేసే అవకాశం ఉందని, అంతే కాకుండా విద్యార్థి సంఘాలు సైతం విద్యాలయాల్లోకి వస్తే ప్రభుత్వ పరువు పోతుందని, విద్యార్థులు ఏకమైతే ఏమవుతుందో తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్‌కు అర్థమైందన్నారు. అందుకే విద్యాలయాల్లోకి విద్యార్థి సంఘాలు, మీడియాను రాకుండా కేసీఆర్ బ్యాన్‌ చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ దీనిపై తక్షణమే స్పందించి పాఠశాల, కళాశాలల్లోకి వెళ్లేందుకు మీడియాకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఏకమయ్యే అవకాశం ఉందని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం విద్యార్థి సంఘ నేతలకు, మీడియాకు క్షమాపణలు చెప్పి వెంటనే వారికి ప్రభుత్వ విద్యాలయాల పరిశీలన కోసం మీడియాకు, విద్యార్థి సంఘ నాయకులకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు