BRS MLAs Disqualification : సుప్రీం తీర్పుకు ముందే ఆ నలుగురు ఎమ్మెల్యేల రాజీనామా?

తెలంగాణలో చర్చనీయశంగా మారిన  బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల్లో నలుగురు మాత్రం అనర్హత వేటుకు ముందే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

New Update
BRS MLAs’ Disqualification

BRS MLAs’ Disqualification

తెలంగాణ(telangana) లో  చర్చనీయశంగా మారిన  బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లడంతో ఇక అనర్హత వేటు పడడం ఖాయమన్న ఆలోచనకు పదిమంది ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలిసింది. అయితే వారిలో కొంతమంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలమే అని చెప్పుకుంటుండగా వారిలో నలుగురు మాత్రం అనర్హత వేటుకు ముందేతమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనర్హత వేటు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో రాజీనామాపై చర్చలు జరుపుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ లో  చేరిన పదిమంది ఎమ్మెల్యేల్లో నలుగురిపై తప్పకుండా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిలో కడియం శ్రీహరి(kadiyam), తెల్లం వెంకట్రావు(tellam-venkata-rao), దానం నాగేందర్(danam), పోచారం శ్రీనివాస్ రెడ్డి(pocharam) లపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  కడియం శ్రీహరి తన కూతురు గెలుపుకోసం కాంగ్రెస్‌ కండువా కప్పుకుని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో పాటు ఇటీవల స్వయంగా తాను కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పడంతో ఆయనపై వేటు పడే అవకాశం ఉంది. దీంతో ఆయన ముందుగానే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. అంతేకాదు తను తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం కూడా ఉందట. అందుకే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

BRS MLAs’ Disqualification

ఇక ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్ లో చేరడమే కాకుండా మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ టికెట్‌పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయనపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన కూడా ముందే రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఇక తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస రెడ్డిలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. వారిలో పోచారం తను రాజీనామా చేసి తన కొడుకుకు టిక్కెట్‌ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. తద్వారా తను రాజీనామా చేసినట్లు అవడమే కాకుండా తన కొడుకును గెలిపించుకున్నట్లవుతుందని భావిస్తున్నారు. తెల్లం వెంకట్రావు ముందునుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్నారు. దీంతో ఆయన కూడా రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌ టికెట్‌ మీద గెలుస్తానన్న ధీమాతో ఉన్నారట.ఒకవేళ వీళ్లు రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత దాని పరిస్థితిని చూసి  వీళ్లు రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత నలుగురు ఒకేసారి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ఒకే సమయంలో అన్ని చోట్లా ఉప ఎన్నికలు వస్తాయని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఇక మిగిలిన ఆరుగురు మాత్రం రాజీనామా చేసే యోచనలో లేరు. వీరంతా టెక్నికల్‌గా తాము బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమే అని చెప్పుకొంటున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ మాత్రం వారిని పార్టీ మారిన వారిగానే భావిస్తోంది. దీంతో ఆ ఆరుగురి విషయలో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది. ఒకవేళ రాజీనామాలు చేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. రాజీనామాకు సిద్ధమైన ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటూ ఈ నలుగురి గురించి సోషల్ మీడియాలో భారీగా పోస్టులు వైరల్ అవుతున్నాయి.  

Also Read: గణేశ్‌ మండపాన్ని పెడుతున్నారా ? ఈ రూల్స్‌ తప్పకుండా పాటించాల్సిందే

Advertisment
తాజా కథనాలు