/rtv/media/media_files/2025/09/15/student-dies-in-wall-collapse-2025-09-15-13-37-00.jpg)
Student dies in wall collapse
Crime News : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. . కవ్వాడి వీధిలోని ప్రైవేటు పాఠశాలలో గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు. కర్నూలు పాతబస్తీలో ఉన్న కీర్తి ఇంగ్లీషు మీడియం స్కూల్లో గోడ కూలింది. దీంతో ఒక విద్యార్థి మరణించగా మరో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాల ప్రకారం స్థానికంగా ఉన్న కీర్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న రాఖీబ్ (5) సోమవారం స్కూల్‌కు ఆలస్యంగా వచ్చాడు. యాజమాన్యం రాఖీబ్‌తో పాటు ఆలస్యంగా వచ్చిన మరో ఐదుగురు విద్యార్థులను కాంపౌండ్‌లో నిల్చోబెట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్ గోడ కూలడంతో రాఖీబ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి
కాగా కర్నూలు పట్టణంలో కీర్తి ఇంగ్లీషు పాఠశాలలో గోడ కూలి విద్యార్థి మృతి చెందడం పై మంత్రి టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడి మృతి ఎంతో బాధ కలిగిస్తోందన్న ఆయన బాలుడి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి బాలుడి కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. . ఘటనపై విచారణ చేస్తామని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కాగా బాలుడి మృతితో పాఠశాల అవరణలో విషాదం నెలకొంది.
Also Read: చీరకొంగునే ఆయుధంగా మలిచి...నక్కతో 65 ఏళ్ల వృద్దురాలు బిగ్ ఫైట్