/rtv/media/media_files/2025/12/16/local-body-elections-2025-12-16-14-34-34.jpg)
Local body elections
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ 17న (బుధవారం) ఈ ఎన్నిక జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మూడో దశలో 4,157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు రాకపోగా.. 394 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 3,752 సర్పంచి పదవులకు 12,640 మంది పోటీ చేస్తున్నారు.
36,434 వార్డు స్థానాలకు 112కి నామినేషన్లు వేయలేదు. 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28,406 వార్డులకు 75,283 మంది బరిలో ఉన్నారు. డిసెంబర్ 11, 14న రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యియి. ఈ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. చెల్లని ఓట్ల నిర్ధారణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
Also Read: కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఫోన్ కాల్ రికార్డ్!
ఇక మూడో విడద ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిసెంబర్ 15న సాయంత్రం నుంచి 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు శాంతిభద్రతల పరిరక్షణకు కలెక్టర్లు, పోలీసులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలు, ఇతర ప్రదర్శనలు చేపట్టకూడదని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు సమయంలో శాంతిభద్రతలు ఉండేలా చూడాలని సూచించింది.
ఇదిలాఉండగా తెలంగాణలో ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికలో కాంగ్రెస్ 53.54 శాతం సర్పంచ్ స్థానాల్లో గెలిచింది. మొత్తం 4,333 స్థానాలకు గాను ఆ పార్టీ మద్దతుదారులు 2,299 సీట్లలో గెలుపొందారు. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1,192 సీట్లలో విజయం సాధించారు. బీజేపీ మద్దతుదారులు 257 గ్రామాలను దక్కించుకోగా.. స్వతంత్రులు 578 స్థానాల్లో గెలిచారు.
డిసెంబర్ 20న పంచాయతీల తొలి సమావేశం నిర్వహించి.. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే రోజున కొత్త సర్పంచుల ఆధ్వర్యంలో జరిగే పాలకవర్గ తొలి సమావేశ తీర్మాలను ఆయా మండలాల ఎంపీడీవోలు సేకరించాలని తెలిపింది. సాయంత్రం 5 గంటలకు వాటిని కలెక్టర్లకు పంపాలని సూచనలు చేసింది.
Also Read: కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. గాలివానల బీభత్సం
ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించింది. వీటిలో ఇప్పటిదాకా రూ.100 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. జిల్లాల్లోని ఎన్నికల నిర్వహణ అధికారుల ఖాతాల్లోకి వీటిని జమ చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా MPDO ఖాతాల్లో కూడా నిధులు జమ చేశారు. ఇక మిగిలిన రూ.75 కోట్లు విడుదల చేయనున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నిధులు సరిపోవని అదనంగా మరో రూ.50 కోట్ల అవసరం ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.
Follow Us