తెలంగాణలో గ్రూప్స్, తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలు ముగిశాక.. ఫలితాలు రావడం, నియామకాలు జరగడం చాలా ఆలస్యమవుతోంది. అనవసరపు సమయాన్ని కేటాయించడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చెబుతోంది. అలాగే తాము ఎక్కువ విధులు నిర్వహించాల్సి వస్తోందని కమిషన్ ఉద్యోగులు వాపోతున్నారు. పరీక్షలు జరిగిన వారంలోనే ఫలితాలు విడుదల చేయడం, నియామకల ప్రక్రియను వేగవంతం చేయడం కోసం తమకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, జనరల్ మెరిట్ లిస్టును సిద్ధం చేసే బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరుతున్నారు. శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి పెట్టేందుకు కమిషన్ త్వరలో ప్రభుత్వానికి లేఖ రాయనుంది. Also Read: నేను అద్దాల మేడ కట్టుకోలేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. '' పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఉద్యోగాలను భర్తీ చేయడం. కానీ మా బాధ్యత లేని విధులు నిర్వహించడం వల్ల చాలా సమయం వృధా అవుతోంది. పరీక్ష ముగిశాక.. ఒక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కోసమే మూడు నుంచి నాలుగు నెలలు వృధా అవుతోంది. జనరల్ మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. మేము ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము. దీనివల్ల ఫలితాలు విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం జరగదు. పరీక్ష జరిగాక వెంటనే ఫలితాలు విడుదల చేస్తే.. అభ్యర్థుల్లో కమిషన్‌పై నమ్మకం ఉంటుంది. అలాగే లిటిగేషన్‌లు కూడా తగ్గుతాయి. జనవరి 3, 4వ తేదీల్లో ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఒక వారం లోపలే మేము పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని అనుకుంటున్నాం. దీనివల్ల అభ్యర్థులకు కమషన్‌పై మరోసారి విశ్వాసం ఏర్పడుతుంది. వేగవంతం, కచ్చితత్వం, పారదర్శకతను మేము కోరుతున్నాం. దేశంలో ఇతర పీఎస్సీల మాదిరిగానే మేము కూడా ఆర్థిక స్వతంత్రత కావాలని, నిర్మాణాత్మక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎక్కువగా మేము ఏమి ఆశించడం లేదు. రాష్ట్ర స్థాయిలో జరిగే పీఎస్సీ, యూపీఎస్సీ మధ్య ఎలాంటి తేడా లేదు. ఇక్కడ కూడా అలాంటిదే అమలు చేయాలని కోరుతున్నాం. Also Read: ఇండియాలోకి చైనా వైరస్.. కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన ప్రతీ ఏడాది మార్చి నాటికి అన్ని శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వం మాకు లిస్ట్ ఇవ్వాలి. దీనివల్ల ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్ జారీ చేయడం, రిక్రూట్‌మంట్ విధానాన్ని చేపట్టే కార్యక్రమలు ప్రారంభిస్తాం. ఇలా చేయడం వల్ల అభ్యర్థులు కూడా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. యూపీఎస్సీని, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రిక్రూట్‌మెంట్ విధానాన్ని మేము అధ్యయనం చేశాం. త్వరలోనే వివరణాత్మక ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేస్తాం. దీనివల్ల తెలంగాణలో కూడా ఉత్తమ ఉద్యోగ నిమాయక ప్రక్రియ అమలు చేయడం సాధ్యమవుతుందని'' బుర్రా వెంకటేశం తెలిపారు.