Telangana: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.700 కోట్లు విడుదల

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు శనివారం భారీగా నిధులు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించిన రూ. 700 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది.

New Update
employee peddling bills

Employee peddling bills

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు శనివారం భారీగా నిధులు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించిన రూ. 700 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఈ నిధులను ఆర్థికశాఖ అన్ని శాఖల ఉద్యోగుల వేతన ఖాతాల్లో జమ చేసింది. దీంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వీటిలో గత 20 నెలలుగా పెండింగులో ఉన్న సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఒకేసారి రూ.392 కోట్లు విడుదలయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఈ చర్య ద్వారా మరోసారి నిరూపించుకుంది.

ప్రతినెలా జీతభత్యాలు గవర్నమెంట్ ఆఫీసుల నుంచి బిల్లులను ఆర్థిక శాఖకు దాఖలు చేయడం ఆనవాయితీ. వీటిని దాఖలు చేసే సమయంలో ఎవరైనా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన వివరాలు పెండింగులో ఉంటే సప్లిమెంటరీ పద్దు కింద మళ్లీ బిల్లును అదే ఆఫీస్ దాఖలు చేస్తుంది. ఇలా గత రెండేళ్లలో దాఖలు చేసిన సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఇంకా రూ.1,900 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేయాల్సి ఉంది. వీటితోపాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులు నెలనెలా రూ.700 కోట్ల చొప్పున దశలవారీగా ఇస్తామని జూన్‌లో మంత్రివర్గం ప్రకటించింది. కాగా, ఈ నెలకు సంబంధించిన రూ.700 కోట్లను శనివారం ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నిధులలో జీతాల సప్లిమెంటరీ బకాయిలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు వంటివి ఉన్నాయి.

ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల కారణంగా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వైద్య ఖర్చుల బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఆర్థిక భారం పెరిగిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం, వైద్య బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అలాగే, మిగిలిన డిమాండ్లైన కొత్త పీఆర్సీ, కరువు భత్యాల (DA) పెంపు వంటి వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత, అన్ని బకాయిలను ఒకేసారి విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో, ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఉద్యోగుల బిల్లులకు రూ.10 వేల కోట్ల వరకు రావాల్సి ఉందని మారం జగదీశ్వర్ అన్నారు.

Advertisment
తాజా కథనాలు