/rtv/media/media_files/2025/04/18/rMnTYmBMu5bwwSOg8UiJ.jpg)
Telangana Excise Department takes key decision
Telangana Excise Department: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మత్తెక్కించే వార్త చెప్పనుంది. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం అమ్మకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. రూ.50 లిక్కర్ టెట్రా ప్యాక్ అందించనుండగా 60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లు లభించనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే బీర్ల ధరలు భారీగా పెంచిన సర్కార్.. ఇప్పుడు లిక్కర్ ధరలను కూడా పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. చీప్ లిక్కర్ మినహా.. మిగిలిన మద్యం ధరలు పెంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం. లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందట.
రూ. 50 పెరిగే అవకాశం..
ఇదే జరిగితే రూ.500 ఉన్న బాటిల్‌పై కనీసం రూ. 50 పెరిగే అవకాశం ఉంది. అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో త్వరలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ తరహాలో మద్యం విక్రయిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను 60 ఎంఎల్, 90 ఎంఎల్, 180 ఎంఎల్ ప్యాకెట్లను అమ్మేందుకు రెడీ అవుతున్నారు. సీసాల్లో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్ల ధర తక్కువగా ఉండనుంది. ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్కర్ ధర రూ.120గా ఉండగా, టెట్రా ప్యాకెట్లలో అది రూ.100కే లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రానుంది.
త్వరలో అందుబాటులోకి టెట్రా ప్యాకెట్లు..
కర్ణాటకలో మెక్‌డొవెల్స్ నంబర్ వన్ కంపెనీ 90 శాతం టెట్రా ప్యాకెట్లలోనే మద్యం విక్రయాలు జరుపుతోంది. రాష్ట్రంలోనూ అదే తరహాలో విక్రయానికి పలు కంపెనీలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను కలిసి టెట్రా ప్యాకెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించినట్లు తెలుస్తోంది. టెట్రా ప్యాకెట్లపై ప్రజల్లో స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు తొలుత కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా విక్రయించాలన్న నిర్ణయానికి ఎక్సై్‌జ్ శాఖ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 2,620 వైన్ షాపులు, 1,117 వరకు బార్లు ఉన్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతోంది.
రూ.2000 కోట్ల అదనపు ఆదాయం..
రాష్ట్రంలో అమ్ముడు పోతున్న మద్యం క్వాంటిటీ చూసినట్లయితే బీర్ కంటే కొంత తక్కువ విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2023-24లో 3.62 కోట్లు కేసుల లిక్కర్ అమ్మకాలు జరగగా, 2024-25లో రెండు శాతం పెరిగినట్లు సమాచారం. ధరలు పెరుగుదల ఎక్కువ ధరలు కలిగిన లిక్కర్‌పైనేనని అధికారులు చెబుతున్నారు. అది ఏవిధంగా తీసుకోవాలన్న కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంఆర్పీ ధరను ఆధారంగా ఈ రేట్లు పెరుగుతాయని అధికార యంత్రాంగం భావిస్తుంది. రెండు, మూడు విధానాల్లో లిక్కర్ ధరలను పెంచి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఏయే విధానం ద్వారా ఎంత ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుందో కూడా ఆ నివేదికల్లో వెల్లడిస్తారు. అధికారులతో సమీక్షించిన తర్వాత మరింత లోతైన అధ్యయనం చేసి ధరలు పెంపుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఏడాదికి తక్కువలో తక్కువ అనుకున్నా రూ.2000 కోట్లు అదనపు రాబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
apliquor | sales | telugu-news | today telugu news | excise-department