BIG BREAKING: సూర్యాపేట టైగర్ ఇకలేరు.. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.

author-image
By Nikhil
New Update
IMG-20251001-WA0014

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాలలో జన్మించిన దామోదర్ రెడ్డి.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు.

కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985లో పోటీ చేసిన మొదట సారే దిగ్గజ నాయకురాలు మల్లు స్వరాజ్యంను ఓడించి రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షించారు దామోదర్ రెడ్డి. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 1999లో టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో తొలిసారి ఓటమి పాలయ్యారు. 2004లో మరోసారి విజయం సాధించి రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

2009లో తుంగతుర్తి ఎస్సి కి రిజర్వుడు కావడంతో సూర్యాపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన దామోదర్ రెడ్డి.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మాత్రం అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయారు. 2014, 18, 23 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. అయినా తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకూ ఆయనే శాసించారు.

దీంతో ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు దామోదర్ రెడ్డిని టైగర్ అని పిలుచుకుంటూ తమ అభిమానాన్ని చాటుతుంటారు. దామోదర్ రెడ్డి ఇక లేడు.. అన్న వార్త తెలుసుకొని వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అంతక్రియలను ఈ నెల 4న తుంగతుర్తి లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 3వ తేదీన ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి సూర్యాపేటలోని నివాసానికి తరలించి అభిమానులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నట్లు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు