CM Revanth: బీఆర్ఎస్ నేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పెద్దాయనకు ఫామ్ హౌస్‌లో ఉండి మెదడు మొద్దు బారిపోయిందన్నారు. ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్‌కు లైకులు బాగానే వస్తాయంటూ నెట్టింట చక్కర్లు కొట్టిన సర్వేపై కౌంటర్ వేశారు. షాద్ నగర్ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ లో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
కర్ర సాయం లేకుండా నిలబడు..
కేసీఆర్ బలంగా కొట్టడం కాదు ముందు కర్ర సాయం లేకుండా సరిగ్గా నిలబడాలంటూ సెటైర్స్ వేశారు. ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? దళితుడిని ముఖ్యమంత్రిని చేశారా? అంటూ ప్రశ్నించారు. మైసమ్మకు, జహంగీర్ పీర్ దర్గాలకు మేకపోతులను వదిలినట్లు కేటీఆర్, హరీష్ రావులను కేసీఆర్ వదిలిండని విమర్శలు గుప్పించారు. 14 నెలల నుంచి ఫాం హౌస్ లో పండుకొని గంభీరంగా చూస్తుండంట. ఎవరిని చూస్తున్నావ్. ఆంబోతులెక్క నీ కొడుకును, అల్లున్ని ఊరి మీదకు వదిలినవ్ అంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ మండిపడ్డారు.
గాలి ఊదితే కొట్టుకుపోతావ్..
కాంగ్రెస్ శ్రేణులు గాలి ఊదితే కేసీఆర్ కొట్టుకుపోతారన్నారు. దమ్ముంటే అసెంబ్లీకొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా తులం బంగారానికి ప్రజలు అమ్ముడుపోయారని అన్నందుకు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ కు జనంతో సంబంధాలు తెగిపోయాయి. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతు బంధు మేము ఇచ్చాం. కేసీఆర్ అబద్దాలు చెప్పి చెప్పి ఓడిపోయారు. కేసీఆర్ బలంగా నిలబడే పరిస్థితి లేదు. కేసీఆర్ హయాంలోనే రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్నారు. సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్, రాఖీ సావంత్ కు సర్వే పెడితే ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ కే ఓట్లు ఎక్కువొస్తాయంటూ కేసీఆర్ పై కౌంటర్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి.
కేసీఆర్ ఎమన్నారంటే..
ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టి.. కాంగ్రెస్ పార్టీ కథ చూస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మీటింగ్ అన్న ప్రాంతాల వారికి దగ్గరలో ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు. నాలుగు రాజులు ఆగాలని తాను ఇన్ని రోజులు చూశానన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన కారణంగా భారీ బహిరంగ సభ పెట్టాలని పార్టీ నేతల నుంచి ప్రతిపాధనలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. దీంతో కేసీఆర్ రీ ఎంట్రీ ఆ సభ నుంచే ఉండనుననట్లు తెలుస్తోంది.