/rtv/media/media_files/2025/01/27/fJK8rkClY3EbATMFnrgd.jpg)
Karimnagar Municipal Corporation
Municipal Elections : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయని భావిస్తున్న ప్రభుత్వం అదే జోష్‌లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలు పెట్టాయి. తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాల్టీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించింది. ఈ నెల 10న తుది జాబితా వెలువరించనుంది. ఆ మరునాడు అంటే జనవరి 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సంక్రాంతి పండగ, సెలవుల కారణంగా కుదరకపోతే పండుగ ముగిసిన తర్వాత 20న విడుదల చేస్తారు. దీనికి అనుగుణంగా, మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్దిశాఖ సిద్ధమవుతోంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినందున ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వా త కచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా ఈ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఈనెల 19 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు 17 లేదా 18న సీఎం రేవంత్ బయలుదేరతారని తెలుస్తోంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగే సమావేశాల తర్వాత ఆయన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ రెండు పర్యటనలను ముగించుకుని ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు వస్తారని, 3న జడ్చర్లకు వెళ్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 3న జడ్చర్లలో ఆయన ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పలు జిల్లాల్లో పర్యటిస్తారు. గత రెండేళ్లలో ఆయన ఎక్కడెక్కడ పర్యటించారన్న వివరాలపై సీఎంవో వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ దఫా జిల్లాల పర్యటనలో గతంలో వెళ్లని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, ఈ మేర కు షెడ్యూల్ తయారవుతోందని సమాచారం.
అదే సమయంలో 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే.. స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడే కేంద్రం గ్రాంట్లు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. కేంద్రం నుంచి దాదాపు రూ.500 కోట్ల ని ధులు రాకుండా ఆగిపోయిన నేపథ్యంలో ము న్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఈ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు తెలిసింది. అనంతరం 300 వార్డులను ఈ మూడు కార్పొరేషన్లకు సర్దుబాటు చేసిన అనంతరం ఓటర్ల జాబితాను ప్రకటించి...ఎన్నికలు వచ్చే మే లేదా జూన్‌లో నిర్వహించే అవ కాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. దానికి ముందే మిగిలిన మున్సిపాలిటీల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది.
Follow Us