/rtv/media/media_files/2025/06/30/reactor-exploded-2025-06-30-16-43-36.jpg)
Reactor Exploded
Reactor Exploded : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో మరో12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
వైస్ ప్రెసిడెంట్ ఎల్‌ఎన్ గోవన్ దుర్మరణం
ఈ ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవాన్ కూడా దుర్మరణం పాలయ్యారు. గోవన్ ఉదయం ప్లాంటులోకి వచ్చిన సమయంలోనే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని ఆయన కారు నుజ్జునుజ్జు అయింది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు.రియాక్టర్ ఛాంబర్ భవనం కుప్పకూలగా.. మరో భవనం బీటలు వారింది. ప్రమాద స్థలిలో కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేనంత చెల్లాచెదురయ్యాయి. కార్మికుల కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లి పోయింది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల్లో అనేక మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
పరిశ్రమ వద్ద ఉద్రక్తత
సంగారెడ్డి జిల్లా పాశమైలారం రసాయన పరిశ్రమ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ప్రమాదంలో చాలామంది కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. తమవారి ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమలోకి వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో కార్మికుల కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి.
ప్రముఖులు సంతాపం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం రసాయన పరిశ్రమలో నెలకొన్న ప్రమాదంపై పలువురు స్పందించారు.
ప్రమాదంపై ప్రధాని మోదీ ట్వీట్
‘తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాము’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.
మెరుగైన వైద్యం అందేలా చూడండి,,,గవర్నర్ ఆదేశం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటన పట్ల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమలో 14 మంది కార్మికుల మృతిపట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలని ఆదుకోవాలన్నారు.
ప్రమాదంపై పవన్ ఆవేదన
తెలంగాణ రాష్ట్రంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడం మూలంగా చోటు చేసుకున్న ఈ పరిశ్రమలో గాయపడ్డవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికీ, ఇతర క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు.