MLC తీన్మార్ మల్లన్న, కవితపై పోలీస్ కేసు నమోదు

MLC తీన్మార్ మల్లన్న, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై కేసు నమోదైంది. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.

New Update
1256322131

MLC Teenmar Mallanna and Kavitha

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై కేసు నమోదైంది. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు.

కార్యాలయంలో ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో జాగృతి కార్యకర్త సాయికి బుల్లెట్ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి.


తొలుత తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత ప్రేరణతో తమపై దాడికి దిగారని, ఆస్తిని ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఐపీసీ 147, 148, 452, 307, 427, 506, 353 రెడ్ విత్ 149, 109 సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు అయింది. మల్లన్న వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూన్యూస్ కార్యాలయం వద్దకు వెళ్లగా, మల్లన్న వర్గం తమపై దాడి చేసి కత్తులు, తుపాకులతో మహిళలను బెదిరించారని, మర్యాదకు భంగం కలిగించారని ఆరోపించారు. దీనిపై 354 బీ, 307, 506, 147, 148, ఆర్మ్స్ యాక్ట్ 25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు