Traffic: పట్నం బాట పట్టిన జనం..హైదరాబాద్‌- విజయవాడ హైవేపై రద్దీ

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. అయితే పండుగ ముగించుకుని పల్లెల నుంచి అందరూ తిరిగి హైదరాబాద్ బాటపట్టారు. దీంతో హైదరాబాద్‌- విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది.

New Update
FotoJet - 2026-01-17T211424.926

Congestion on the Hyderabad-Vijayawada highway

Traffic: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. అయితే పండుగ ముగించుకుని పల్లెల నుంచి అందరూ తిరిగి హైదరాబాద్ బాటపట్టారు. దీంతో హైదరాబాద్‌- విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. ఎన్‌హెచ్‌ 65పై చిట్యాల, పెద్ద కాపర్తి, చౌటుప్పల్ ప్రధాన కూడళ్లలో వాహనాలు బారులు తీరాయి. కొర్లపహడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్‌ గేట్లు, ఇతర చోట్ల వాహనాల రద్దీని పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు

అద్దంకి- నార్కట్ పల్లి హైవేపై కూడా వాహనాల రద్దీ నెలకొంది. పొందుగుల బ్రిడ్జి, దామరచర్ల, మిర్యాలగూడ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రద్దీని నియంత్రించేందుకు ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఎన్‌హెచ్‌-65 విస్తరణ పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. చిట్యాల, పెద్దకాపర్తి, కొర్లపహాడ్‌, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసుల ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. సంక్రాంతి తర్వాత సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం తెలంగాణ పోలీస్, రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ కష్టాలు లేకుండా.. డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ఆగకుండా, ఫాస్టాగ్ వాడమని, గూగుల్ మ్యాప్స్ ఫాలో అవ్వమని సూచనలు జారీ చేశారు.
 
సంక్రాంతి సంబరాలు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యే ప్రజల సౌకర్యార్థం తెలంగాణ పోలీస్, రవాణా శాఖ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా విజయవాడ - హైదరాబాద్ (NH-65) జాతీయ రహదారిపై ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా భారీగా వాహనాల మళ్లింపు చేపట్టింది. ప్రస్తుతం జాతీయ రహదారిపై జరుగుతున్న విస్తరణ పనుల కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా పలు చోట్ల వాహనాలను దారి మళ్లించారు. ప్రయాణీకులు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలను కొనసాగించాలని పోలీసులు సూచిస్తున్నారు.
 
విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కోదాడ వద్దే దారి మళ్లిస్తున్నారు.  భారీ వాహనాలను కోదాడ నుంచి  హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు.అద్దంకి- నార్కట్‌పల్లి రోడ్డుపై వచ్చే వాటిని మిర్యాలగూడ వద్ద దారి మళ్లించారు.వాహనాలను మిర్యాలగూడ- హాలియా -మల్లేపల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తున్నారు. హైవేపై పరిస్థితి మేరకు చిట్యాల నుంచి భువనగిరి మీదుగా మళ్లించడంతో పాటు .ట్రాఫిక్‌ పరిస్థితిపై డ్రోన్‌, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు