Operation Polo : ఆపరేషన్ పోలో... 5 రోజుల్లోనే సైన్యం ముందు మొకరిల్లిన నిజాం..ఎందుకంటే?

ఆపరేషన్ పోలో కింద, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారు. ఈ ఆపరేషన్ 1948లో సెప్టెంబర్ 17న పూర్తయింది. నేడు దాని వార్షికోత్సవం. భారత దేశ స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని ఏకం చేయడం అత్యంత సవాలుగా ఉన్న సమయం.

New Update
Operation Polo.

Operation Polo

Operation Polo : ఆపరేషన్ పోలో కింద, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారు. ఈ ఆపరేషన్ 1948లో సెప్టెంబర్ 17న పూర్తయింది. నేడు దాని వార్షికోత్సవం.  భారత దేశ స్వాతం త్య్రం అనంతరం దేశాన్ని ఏకం చేయడం అత్యంత సవాలుగా ఉన్న సమయం. వందలాది రాచరిక సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం ఒక సంక్లిష్టమైన సమస్యగా మారింది, ఇక్కడ నిజాం ఆశయాలు, మతపరమైన ఉన్మాదం ఆందోళన రేకెత్తించాయి. ఆపరేషన్ పోలో, దీనిని పోలీస్ యాక్షన్ అని కూడా పిలుస్తారు.ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో భారతదేశం తీసుకున్న నిర్ణయాత్మక అడుగు. ఈ ఆపరేషన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసింది. ఈ ఆపరేషన్ సైనిక విజయానికి ఉదాహరణ మాత్రమే కాదు, పటేల్ దృఢ సంకల్పం. వ్యూహాత్మక దూరదృష్టికి చిహ్నం కూడా.   ఆపరేషన్ పోలో మూలాలు భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నాటివి. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు, బ్రిటిష్ ఇండియాలో 565 రాచరిక రాష్ట్రాలు ఉండేవి. వాటికి భారతదేశంలో లేదా పాకిస్తాన్‌లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం అనే ఎంపిక ఉండేది. దక్షిణ భారతదేశంలో ఉన్న హైదరాబాద్, విస్తీర్ణంలో ఆస్ట్రేలియా అంత పెద్దది. ఆ సమయంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ దీనిని పాలించాడు. అతను భారతదేశంలో చేరడానికి నిరాకరించాడు. అతను స్వతంత్రంగా ఉండాలని లేదా పాకిస్తాన్‌లో చేరాలని కోరుకున్నాడు. అయితే, హైదరాబాద్ భౌగోళిక పరంగా భారతదేశం నడిబొడ్డున ఉంది. దీంతో పటేల్‌ భారతదేశ గుండెలో శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సిన పుండుగా దీన్ని అభివర్ణించారు.

రజాకార్ల దురాగతాలు

నిజాం సైన్యం, ఖాసిం రిజ్వీ నేతృత్వంలోని రజాకార్లు హిందూ మెజారిటీ జనాభాపై దౌర్జన్యాలు ప్రారంభించారు. రజాకార్లు 'హన్స్ కే లియా హై పాకిస్తాన్, లడ్ కే లేంగే హిందూస్తాన్' అనే నినాదాన్ని ఇచ్చారు, ఇది వారి వేర్పాటువాద ఉద్దేశాలను ప్రతిబింబిస్తుంది. సర్దార్ పటేల్ అప్పటి హోంమంత్రి. ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించడానికి ఆయన ప్రయత్నించారు. ఆయన నిజాంతో అనేక రౌండ్ల చర్చలు జరిపారు, కానీ నిజాం మొండితనం , రజాకార్ల హింస పరిస్థితిని మరింత దిగజార్చాయి. హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటే, అది భారతదేశ ఐక్యతకు ముప్పు కలిగిస్తుందని పటేల్‌కు తెలుసు. అటువంటి పరిస్థితిలో, 1948లో, పటేల్‌ నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూను ఒప్పించి సైనిక చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. 1948 సెప్టెంబర్ 13న, భారత సైన్యం మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో హైదరాబాద్‌ పై దాడి చేసింది. ఈ ఆపరేషన్ కేవలం ఐదు రోజుల్లోనే పూర్తయింది. భారత సైన్యం సికింద్రాబాద్, బీదర్ తో పాటు పలు ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. సెప్టెంబర్ 17న, నిజాం లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ భారతదేశంలో భాగమైంది.

పటేల్ దృఢమైన నాయకత్వం

ఈ ఆపరేషన్ విజయం పటేల్ దృఢమైన నాయకత్వానికి నిదర్శనం . ఆయన సైనిక వ్యూహాన్ని రూపొందించడమే కాకుండా రాజకీయ ఒత్తిడిని కూడా ప్రయోగించారు. నెహ్రూ మొదట్లో సైనిక చర్యను వ్యతిరేకించారు, కానీ పటేల్ పట్టుదల ఆయనను ఒప్పించింది. హైదరాబాద్ స్వాతంత్ర్యం మరింత విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉన్నందున, ఈ ఆపరేషన్ భారతదేశ ఐక్యతకు చాలా అవసరం. పటేల్ 500 కంటే ఎక్కువ రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు, కానీ హైదరాబాద్ అత్యంత సవాలుతో కూడుకున్నది.

భారత పత్రికల్లో హైదరాబాద్ దక్కన్‎లో రజాకార్లు, కమ్యూనిస్టులు ఆరాచకాలు చేస్తున్నట్లుగా వార్తలు రావడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  కేవలం 5 రోజుల్లో సైనిక చర్య ద్వారా హైదరాబాద్‌ భారత్‌ లో విలీనమైంది. ఆ ఐదు రోజుల్లో ఏం జరిగిందంటే..

సెప్టెంబరు 13, 1948 (తొలి రోజు)
స్వాతంత్ర ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ ఆదేశాలతో ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానం విముక్తికి సైన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ దక్కన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైన్యం 13న ఉదయం బయలుదేరింది. హైదరాబాద్ రాజ్యానికి నలు వైపుల నుంచి హైదరాబాద్‌ రాజ్యాన్ని భారత ఆర్మీ చుట్టుముట్టింది. యుద్ధ ట్యాంకులతో సరిహద్దులు దాటి, లోపలికి ప్రవేశించాయి. వరంగల్, బీదర్, రాయచూర్, ఆదిలాబాద్, ఔరంగాబాద్ వైమానిక స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ బాంబులు వేసింది.

సెప్టెంబరు 14 (రెండో రోజు)
నిజాం సైన్యం నుంచి పెద్దగా  ప్రతిఘటన లేకుండానే ఇండియన్ ఆర్మీ అన్ని వైపుల నుంచి ముందుకు దూసుకుపోయింది. ఉదయానికి ఔరంగాబాద్ పట్టణాన్ని భారత సైన్యం చేజిక్కించుకుంది. నిజాం పూర్తి నిరాశతో నిండిపోయాడు. తనను కలిసేందుకు వచ్చిన ప్రధానమంత్రిని చూసి ఉస్మాన్ అలీఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బీదర్, జాల్నా పట్టణాలను భారత సైన్యం ముట్టడించింది. తూర్పు నుంచి చొచ్చుకు వస్తున్న భారత సైన్యాన్ని నిలువరించడానికి వైరా, పాలేరు రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని, దిగువభాగంలో కాలువల కట్టలు తెంచాలని ప్రధాన మంత్రి లాయక్ అలీ ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చిండు. వాళ్లు చెప్పినట్లే చేశారు.  దీంతో నల్లరేగడి నేలలు బురదమయం కావడంతో భారత సైనికులు నడవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వాహనాలు రాలేకపోయాయి. హుజూరాబాద్- మిర్యాలగూడ దారిగుండా ఇండియన్ ఆర్మీ మూసీ కాలువను దాటింది. ఆ దళాలను నిలువరించడానికి సూర్యాపేట నకిరేకల్ దారిలో మూసీపై ఉన్న వంతెనని నిజాం ప్రభుత్వం కూల్చివేసింది. మూసీని దాటి రాకుండా వరద పెంచాలని హిమాయత్ సాగర్ గేట్ల ను కూడా ఎత్తారు. హైదరాబాద్ రాజ్యాన్ని భారత సైన్యం ఆక్రమించుకోకుండా నిలువరించలేమని అర్థమైంది.  కనీసం హైదరాబాద్ నగరాన్ని అయినా కాపాడుకోవాలనే ఆలోచనలో పడింది నిజాంప్రభుత్వం. అయితే, ఈ కేబినేట్ సమావేశం ముగిసే సమయానికి భారత సైన్యం బీదర్ సమీపానికి వచ్చిందని దక్కన్ రేడియోలో వార్త ప్రసారమైంది. కల్యాణి - బీదర్ దారిలో భారత సైన్యం వేగంగా దూసుకువస్తున్నట్లు ఆర్మీ కమాండర్ ప్రధాన మంత్రికి ఫోన్ చేసి చెప్పిండు. దీంతో వారి ఆలోచలన్నీ ఆవిరయ్యాయి.  

 సెప్టెంబరు 15 (మూడవ రోజు)
హైదరాబాద్ దక్కన్ పశ్చిమ భాగాన్ని పూర్తిగా ఇండియన్ యూనియన్ సైన్య చేజిక్కించుకుంది. ఆపరేషన్ పోలోలో పాల్గొన్న ప్రధాన దళం దాలం నుంచి కల్యాణి పట్టణానికి చేరింది. భారత సైన్యం బీదరు ఆక్రమించుకున్నట్లుగా ఆల్ ఇండియా రేడియో ప్రకటించింది. సైన్యం కల్యాణి - బీదర్ మీదుగా హైదరాబాద్‌  వస్తున్నట్లుగా సమాచారం అందిందని ప్రధాన మంత్రికి కబురు వచ్చింది. అప్పటి మ్యాప్‌లో ఆ రోడ్డు లేదు. అది ఎలా సాధ్యమంటూ అప్పటి రోడ్ల చీఫ్ ఇంజినీర్‌కి ప్రధాన మంత్రి ఫోన్ చేసి అడిగాడు. అయితే ఈ మధ్యే రోడ్డు వేశామని ఆయన చెప్పడంతో తల పట్టుకున్నాడు. ఆ రోడ్డు ఉన్నట్లు కమాండర్‎, ఇంటెలిజెన్స్ వారికీ తెలియదు కానీ భారత సైన్యం మాత్రం దాని గురించి ఎలా  తెలుసుకుందని అర్ధం కాక నిజాం ప్రభుత్వం తలపట్టుకుంది. చేసేదేమి లేక సైన్యాన్ని జహీరాబాద్ దగ్గర మోహరించారు. హైదరాబాద్‌కు ఇండియన్‌ సైన్యం వేగంగా చేరుకోకుండా అడ్డుకోవాలన్నది వ్యూహం. కానీ, అప్పటికే పరిస్థితులన్నీ చేయిదాటిపోతున్నాయి.

సెప్టెంబరు 16 (నాలుగో రోజు)
బీదర్‌లో ఉన్న ఇండియన్ ఆర్మీ జహీరాబాద్ వైపుకు కదిలింది. భారత సైన్యం అన్నివైపుల నుంచి దూసుకువస్తుంది. హైదరాబాద్ సైన్యం ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితికి చేరింది. రాత్రి ప్రధాన మంత్రి నిజాంని కలిశాడు. ఇప్పుడు రెండు మార్గాలున్నట్లుగా వాళ్ల మధ్య చర్చకు వచ్చింది. నిజాం తప్పుకుని మంత్రి మండలికీ పాలన అప్పగించడం లేదా మంత్రి మండలిని రద్దు చేసి ఇండియాతో ఒప్పందం చేసుకోవడం.  రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవలసిన పరిస్థితి.ఈ విషయం రేపు పొద్దున తొమ్మిది గంటలకు చెబుతానని నిజాం అనడంతో ఆ సమావేశం ముగిసింది. మరునాడు హైదరాబాద్ కేబినెట్ సమావేశమైంది. మంత్రి మండలి రాజీనామా చేసింది. దానిని నిజాం అంగీకరించాడు. అదే రోజు మధ్యాహ్నం లాయక్ అలీ డక్కన్ రేడియో కేంద్రానికి చేరుకుని హైదరాబాద్ రాజ్య స్వతంత్ర్యాన్ని కాపాడలేకపోయానని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు.

సెప్టెంబరు 17 (ఐదో రోజు)
భారత సైన్యం హైదరాబాద్ కు 30 మైళ్ల దూరంలో ఉన్న బీబీ నగర్‎కు చేరుకుంది. భారత సైన్యానికి లొంగిపోవాలని నిజాం నిర్ణయించుకున్నాడు. తాను లొంగిపోతున్నట్లు రేడియోలో ప్రకటించాడు. సెప్టెంబరు 18న బొల్లారంలోని రెసిడెన్సీలో  ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ చౌదరికి ఘనంగా స్వాగతం పలికారు. బొల్లారంలోని రెసిడెన్సీపై ఇండియా పతాకం ఎగిరింది. ఆ తర్వాత చౌదరి ఆధ్వర్యంలో మిలటరీ పాలన ప్రారంభమైంది. సెప్టెంబరు 19 నాటికి అన్ని దిక్కుల నుండి ప్రవేశించిన సైన్యాలు హైదరాబాద్ చేరుకున్నాయి. ఆ తర్వాత చౌదరి మిలటరీ పాలనను రద్దు చేసి సివిల్ సర్వెంట్ వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణా రావు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేశారు. అనంతరం  17 సెప్టెంబరు 1948న జరిగిన ఆపరేషన్ పోలో తర్వాత నిజాం పాలన అంతమయింది. హైదరాబాద్ దక్కన్ స్టేట్ ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత ఉస్మాన్ అలీఖాన్ కు రాజప్రముఖ్ హోదా ఇచ్చారు.

Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

Advertisment
తాజా కథనాలు