/rtv/media/media_files/2025/07/25/murder-2025-07-25-13-12-06.jpg)
Murder-mystery-solved-in-jagitial-district, Know Details
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రెండేళ్ల క్రితం భర్తను భార్య హత్య చేసిన మిస్టరీ తేటతెల్లమయ్యింది. తాగుడుకు, జూదానికి బానిసైన భర్త ఇంట్లో వస్తువులు అమ్ముతూ భార్యను వేధిస్తుండేవాడు. అతడి తీరుపట్ల విసిగిపోయిన భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ ఘటన తర్వాత నిందితులు శవాన్ని తగలబెట్టారు. దీంతో ఆ శవం ఎవరనేది గుర్తించడం పోలీసులకు కష్టతరమైంది. అయితే తాజాగా ఓ గంజాయి కేసులో ముగ్గురు పట్టుబట్టారు. వాళ్లే నాటి హత్య కేసులో నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీళ్లతో పాటు మృతుడి భార్య మరొకరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read: ఎంతకి తెగించావ్ రా, జైలు గోడ దూకి పరారైన ఖైదీ.. చివరికి ఊహించని షాక్
ఈ కేసుకు సంబంధించిన వివరాలు డీఎస్పీ రఘుచందర్ మీడియాకు వివరించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని సాయిరాం కాలనీలో సింగం నడిపి గంగాధర్(45), భార్య సంధ్య ఉండేవారు. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గంగాధర్ తాగుడికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యను వేధించేవాడు. పెద్ద కూతురు పెళ్లికి కూడా అతడు అడ్డుచెప్పాడు. దీంతో భార్య సంధ్య అతడికి రూ.10 ఇస్తానని ఆశపెట్టి కూతురుకు పెళ్లి జరిపించింది. ఆ తర్వాత గంగాధర్ తరచూ కూతురు అత్తగారింటి వెళ్లి అల్లుడితో కూడా గొడవ పడుతుండేవాడు. దీంతో అతడి ప్రవర్తన పట్ల సంధ్య విసిగిపోయింది.
చివరికి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని భర్త అన్న కొడుకైన సింగం గ్రాహిత్, అతడి తల్లి మమతకు చెప్పింది. గంగాధర్‌ను హత్య చేసేందుకు రూ.40 వేలు ఇస్తే ముగ్గురిని తీసుకొస్తానని గ్రాహిత్ చెప్పాడు. ఆమె డబ్బులు ఇవ్వడంతో గ్రాహిత్ మెట్‌పల్లి ప్రాంతానికే చెందిన అబ్దుల్ అప్సర్, చెన్న నిఖిల్, పవన్‌తో మాట్లాడాడు. 2023లో మార్చి 12న అద్దె కారులో సంధ్య, గంగాధర్, గ్రాహిత్, మమతతో పాటు అప్సర్, నిఖిల్, పవన్ కూడా కలిసి కొండగట్టుకు వెళ్లారు. అక్కడ ఓ టేకు తోట దగ్గర్లో గంగాధర్‌కు మద్యం తాగించారు. ఆ తర్వాత గంగాధర్ మెడ చుట్టూ వైరు బిగించారు. దీంతో ఊపిరాడక గంగాధర్ మృతి చెందాడు. ఆ తర్వాత మృతదేహంపై చెత్తనంతా పోగేసి తగలబెట్టి వెళ్లిపోయారు.
Also Read: భారత్ పై చైనా భారీ కుట్ర.. ఓ వైపు భారీ డ్యామ్.. మరో వైపు వార్ బేస్ నిర్మాణం!
ఆ తర్వాత గంగాధర్ గురించి స్థానికులు ఎవరు అడిగినా తమను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడని సంధ్య చెప్పేది. అయితే ఆ టేకు తోటలో సగం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఇక జులై 17న పోలీసులు ఓ గంజాయి కేసులో గ్రాహిత్, అప్సర్, నిఖిల్‌ను అరెస్టు చేశారు. అయితే వాళ్లను విచారణ చేయగా నిందితుల ఫోన్‌లలో గంగాధర్ హత్యకు సంబంధించిన దృశ్యాలు బయటపడ్డాయి. చివరికి నిందితులను తమదైన రీతిలో ప్రశ్నించడంతో గంగాధర్‌ను తామే హత్య చేశామని అంగీకరించారు. ప్రస్తుతం వీళ్లు జైల్లో ఉన్నారు. అలాగే గురువారం మృతుడు గంగాధర్ భార్య సంధ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో మరో నిందితురాలు గ్రాహిత్ తల్లి మమత గతంలోనే చనిపోయింది.