/rtv/media/media_files/2025/07/31/brs-mlas-2025-07-31-11-08-22.jpeg)
MLAs' disqualification
MLAs' disqualification : గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పొయిన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉండటంతో దానికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన భావిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు, పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో విచారణ చేపట్టేందుకు స్పీకర్ కార్యాలయం సిద్ధమైంది.
ఈ క్రమంలో నోటీసులు అందుకున్న వారిలో 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. వారి విచారణను అక్టోబర్ 5వ తేదీలోగా ముగించాలని స్పీకర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ అక్టోబర్ 6 నుంచి 23 వరకు కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు కోసం బార్బడోస్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు ముందే ఈ విచారణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు విచారణలో భాగంగా వాదనలు వినిపించేందుకు ఆయా ఎమ్మెల్యేలు న్యాయవాదులను నియమించుకోవాలని స్పీకర్ కార్యాలయం ఇరుపక్షాలకు ఇటీవల మెమో జారీ చేసింది. దీనికి స్పందనగా, తమ తరపున న్యాయవాదిని నియమించుకున్నట్లు బీఆర్ఎస్ శాసనసభాపక్షం ప్రతినిధి శుక్రవారం స్పీకర్ కార్యాలయానికి లేఖ రాశారు. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే సోమవారం నుంచి విచారణ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. రోజుకు ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున నాలుగు రోజుల్లో 8 మంది విచారణను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
స్పీకర్ నిర్ణయం మేరకు అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 29 (సోమవారం) ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. అయితే, 29వ తేదీన పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల అడ్వకేట్లు వాదిస్తారు. ఇక, అక్టోబర్ 1వ తేదీన ఫిర్యాదుదారు అడ్వకేట్ల తో పాటు పార్టీ మారిన ఎమ్మె్ల్యేల లాయర్లతోనూ వాదిస్తారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకి మొదట రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ, మధ్యాహ్నం 3గంటలకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు హాజరుకావలసి ఉంది. స్పీకర్/చైర్మన్ ఆధ్వర్యంలో 10 షెడ్యూల్ ప్రకారం విచారణ జరపనున్నారు.
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు నోటీసులు ఇవ్వగా.. ఇందులో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది తమ వివరణలను అందజేసినట్లు తెలుస్తోంది. ఇరుపక్షాల వివరణలు, అభ్యంతరాలు న్యాయసమీక్షకు అనుగుణంగా స్పీకర్ కార్యాలయానికి చేరడంతో విచారణకు శాసనసభాపతి కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈనెల 29 నుంచే స్పీకర్ సమక్షంలో విచారణ ప్రారంభించనున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో తొలివిడత.. తిరిగి వచ్చే 3, 4, 5 తేదీల్లో మలిదశ విచారణ చేపట్టనున్నారు. కాగా కడియం మాత్రం ఈ నెల 30లోపు వివరణ ఇస్తానని చెప్పినట్టు తెల్సింది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేశారు. అలాగే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య తరుపున కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేశారు. దీంతో వారిద్దరూ స్పీకర్‌కు వివరణ ఇవ్వలేదు. అయితే వారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!